Vijayashanti: ఈ రంగాన్ని సీఎం కేసీఆర్ పూర్తిగా మర్చిపోయారు: విజయశాంతి
- విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతోందన్న విజయశాంతి
- కేజీ నుంచి పీజీ విద్య ఉచితమన్న హామీపై నిలదీత
- గురుకులాల్లో కొందరికే అవకాశమని వెల్లడి
- నూతన విద్యావిధానం అమలు చేయడంలేదని ఆరోపణ
తెలంగాణలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతోందంటూ బీజేపీ మహిళా నేత విజయశాంతి టీఆర్ఎస్ పాలనపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని సమీక్షించాలన్న అంశాన్ని సీఎం కేసీఆర్ పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించి గద్దెనెక్కారని, కానీ ఈ ఏడేళ్ల కాలంలో ఆ హామీని ఎక్కడా అమలు చేయలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఏనాడూ విద్యారంగ సమీక్షకు సమయం కేటాయించిన దాఖలాలు లేవని విజయశాంతి పేర్కొన్నారు.
గురుకులాలు ఏర్పాటు చేసి విద్యనందిస్తున్నామని, ప్రతి విద్యార్థిపై రూ.1.32 లక్షలు ఖర్చుచేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ గురుకులాల ద్వారా కొందరు విద్యార్థులకే చదువు అందుతోందని, గ్రామాల్లోని మిగతావారి పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలోని 1000 గురుకులాల్లో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 4 లక్షలకు మించదని, మిగిలిన విద్యార్థులకు విద్య అందించే బాధ్యత సర్కారుపై లేదా? అని నిలదీశారు.
సీఎం కేసీఆర్ చదువుకున్న దుబ్బాక పాఠశాల, మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేటలోని బడి, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల సర్కారు బడి ఉన్నట్టే రాష్ట్రంలో మిగతా బడులు ఎందుకు ఉండకూడదో వారే చెప్పాలని విజయశాంతి వ్యాఖ్యానించారు.
కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానాన్ని పక్కనే ఉన్న ఏపీ అమలు చేస్తోందని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కిండర్ గార్టెన్ తరగతులు ప్రారంభించేందుకు వీలున్నా, ప్రభుత్వం వైపు నుంచి చర్యలు లేవని వివరించారు.
దానికితోడు, రాష్ట్ర వ్యాప్తంగా 26 వేలకు పైగా పాఠశాలల్లో విద్యార్థులు లేరంటూ వాటిని మూసివేసేందుకు ప్రభుత్వం ప్రక్రియ షురూ చేసిందని వెల్లడించారు. 2 వేల స్కూళ్లను మూసివేసి 10 వేల మంది టీచర్లు అదనంగా ఉన్నారని లెక్కలు వేస్తోందని విమర్శించారు. విద్యారంగం... పెట్టుబడి పెట్టినా రాబడి రాని రంగం అని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే రాబడి వచ్చే మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టి భారీగా ఆదాయాన్ని పొందుతోందని విజయశాంతి వివరించారు.