Sony pitctures: సోనీ-జీ కంపెనీల మధ్య విలీన ఒప్పందం
- సోనీలో విలీనం కానున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్
- ఒప్పందంపై సంతకాలు చేసిన జీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్
- జీ సీఈవో పునీత్ గోయెంకా మరో ఐదేళ్లపాటు ఎండీ, సీఈవోగా కొనసాగింపు
- విలీనం తర్వాత జీ వద్ద 47.07 శాతం, సోనీ వద్ద 52.93 శాతం వాటాలు
భారతదేశంలోని ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో తమ సంస్థను విలీనం చేయాలని జీ కంపెనీ ప్రతినిధులు నిర్ణయించారు. బుధవారం జరిగిన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సమాచారం.
జీ కంపెనీ సీఈవోగా ఉన్న పునీత్ గోయెంకా ఈ ఒప్పందం తర్వాత మరో ఐదేళ్లు ఎండీ, సీఈవోగా కొనసాగనున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సోనీ సంస్థ 1.57 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. విలీనం తర్వాత కంపెనీలో అధిక శాతం డైరెక్టర్లను సోనీ కంపెనీనే నామినేట్ చేస్తుంది. అలాగే విలీనం తర్వాత జీ వద్ద 47.07 శాతం, సోనీ వద్ద 52.93 శాతం వాటాలు ఉంటాయి. 90 రోజుల్లో ఈ విలీనంపై ఒప్పందం జరగనుంది.
జీ సంస్థ మంచి ఎదుగుదల చూపిస్తోందని, ఈ విలీనం వల్ల కంపెనీకి మరింత లబ్ధి చేకూరుతుందని బోర్డు భావిస్తోందని సంస్థ చైర్మన్ ఆర్. గోపాలన్ తెలిపారు. ఈ విలీనం వల్ల బిజినెస్ అభివృద్ధి జరుగుతుందని, అలాగే షేర్‌హోల్డర్లకు కూడా లాభదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు. జీ కంపెనీ షేర్ హోల్డర్ల ఆమోదం కోసం త్వరలోనే ఈ ప్రతిపాదనను ప్రవేశపెడతామని వివరించారు.