Asaduddin Owaisi: ఢిల్లీలో ఒవైసీ నివాసాన్ని ధ్వంసం చేసిన దుండగులు

Goons vandalized Asaduddin Owaisi house in Delhi
  • అశోక్ రోడ్డులో ఒవైసీ అధికారిక నివాసం
  • కర్రలు, గొడ్డళ్లతో వచ్చిన దుండగులు
  • ఇంటిపై రాళ్లతో దాడి
  • ఆరుగురిని అరెస్ట్ చేశారన్న ఒవైసీ
  • ఇలాంటి దాడులకు మజ్లిస్ భయపడదని వ్యాఖ్య  
దేశ రాజధాని ఢిల్లీలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇటీవల అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే తాము ఈ దాడులు చేసినట్టు వారు తెలిపారు. ఈ మేరకు డీసీపీ దీపక్ యాదవ్ వెల్లడించారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.

కాగా, దుండగుల దాడిలో ఒవైసీ నివాసంలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసం అయ్యాయి. ఎంపీగా ఆయనకు ఢిల్లీలోని అశోక్ రోడ్డులో నివాసం కేటాయించారు. ఇప్పుడా నివాసంపైనే దాడి జరిగింది. దీనిపై ఒవైసీ ఘాటుగా స్పందించారు. పిరికిపందలు గుంపుగా వచ్చి దాడి చేశారని వెల్లడించారు. అది కూడా తాను ఇంట్లో లేని సమయం చూసి వచ్చారని తెలిపారు. వారి చేతిలో గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయని, వారు తన నివాసంపై రాళ్ల దాడి చేశారని, తన ఇంటి నేమ్ ప్లేట్ ను కూడా ధ్వంసం చేశారని వివరించారు.

గత 40 ఏళ్లుగా ఈ ఇంటిని కనిపెట్టుకుని ఉంటున్న రాజు అనే వ్యక్తిపైనా దాడికి పాల్పడ్డారని, దాడి సందర్భంగా వారు మతపరమైన నినాదాలు చేశారని ఒవైసీ పేర్కొన్నారు. రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని వెల్లడించారు. తన నివాసంపై దాడికి పాల్పడడం ఇది మూడోసారని తెలిపారు. ఓ ఎంపీ నివాసానికే రక్షణ లేకపోతే కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా ఏం భరోసా ఇవ్వగలరు? అని ప్రశ్నించారు. అతివాదాన్ని నిర్మూలించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి ప్రవచనాలు వినిపిస్తుంటారని, తన ఇంటిపై దాడి చేసిన గూండాలకు అతివాదం నేర్పింది ఎవరో చెప్పాలని ఒవైసీ నిలదీశారు.

ఈ దాడులతో తమను భయపెట్టాలని ఈ గూండాలు అనుకుంటే అంతకంటే పొరబాటు మరొకటి ఉండదని, బహుశా వారికి మజ్లిస్ ఏ ప్రాతిపదికన ఏర్పడిందో తెలిసుండకపోవచ్చని వ్యాఖ్యానించారు. న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
Asaduddin Owaisi
House
Vandalize
New Delhi
Police

More Telugu News