Corona Virus: క్యాన్సర్ పేషెంట్లపై కూడా వ్యాక్సిన్లు ప్రభావశీలం: తాజా అధ్యయనంలో వెల్లడి
- 791 మంది క్యాన్సర్ పేషెంట్లపై జరిగిన పరిశోధన
- గత క్లినికల్ ట్రయల్స్‌లో క్యాన్సర్ పేషెంట్లు లేరు
- వ్యాక్సిన్ల సామర్థ్యంపై కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ప్రభావంపై అధ్యయనం
కరోనాకు తయారు చేసిన వ్యాక్సిన్లు క్యాన్సర్ పేషెంట్లపై కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయని పరిశోధకులు తెలిపారు. ఈ విషయంలో తాజాగా నెదర్లాండ్స్‌లో కొందరు శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గతంలో చేసిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ క్యాన్సర్ పేషెంట్లపై జరగలేదు. అసలే క్యాన్సర్ చికిత్సతో వారి రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది.
ఇలాంటి వారిపై కరోనా వ్యాక్సిన్ ప్రభావం చూపుతుందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటి వరకూ లభించలేదు. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్‌లోని పలు ఆసుపత్రుల్లో ఉన్న సుమారు 791 మంది పేషెంట్లపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరిలో క్యాన్సర్ లేనివారితోపాటు క్యాన్సర్ రోగులు కూడా ఉన్నారు. అలాగే కీమోథెరపీ చేయించుకునేవారు, ఇమ్యూనోథెరపీ చేయించుకునేవారు, కీమో-ఇమ్యూనోథెరపీ చికిత్సలు చేయించుకునే వారు కూడా ఉన్నారు.
ఈ బృందాలపై నిర్వహించిన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రకారం క్యాన్సర్ పేషెంట్లు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే వారిలో కూడా కరోనా యాంటీబాడీలు పుష్కలంగా రికార్డయ్యాయి. కీమో థెరపీ తీసుకుంటున్న క్యాన్సర్ పేషెంట్లలో ఈ యాంటీబాడీలు 84 శాతం ఉండగా, కీమో-ఇమ్యూనోథెరపీ తీసుకునేవారిలో 89 శాతం, ఇమ్యూనోథెరపీ తీసుకునేవారిలో 93 శాతం యాంటీబాడీలు ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ (ఈఎస్‌ఎమ్‌వో) వార్షిక సమావేశంలో ఈ అధ్యయన ఫలితాలను అంతర్జాతీయ పరిశోధకుల ముందుంచారు. క్యాన్సర్ పేషెంట్లకు ‘బూస్టర్ డోస్’గా ఇచ్చే మూడో వ్యాక్సిన్ మరింత ప్రభావవంతంగా ఉండే అవకాశం ఉందని ఈ పరిశోధన చెబుతోంది.