Pfizer: 5-11 ఏళ్ల చిన్నారులకు కూడా ఫైజర్ టీకా సురక్షితమే!: తాజా అధ్యయనంలో వెల్లడి
- క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో వెల్లడి
- స్థిరమైన రోగనిరోధక స్పందన కనిపించిందన్న పరిశోధకులు
- 12 ఏళ్లు పైబడిన వారి కన్నా కొంచెం తక్కువ డోసులో ఇవ్వనున్న టీకా
- ప్రపంచ దేశాల్లోని రెగ్యులేటరీ బోర్డులకు త్వరలోనే నివేదికలు
కరోనా నియంత్రణలో టీకా ప్రాధాన్యం తెలిసిందే. మరి, చిన్నపిల్లలకు సైతం వ్యాక్సిన్ ఇవ్వొచ్చా? అనే సందేహాలు చాలామందిలో వ్యక్తమవుతున్నాయి. ఈ సందేహాలకు ఫైజర్, బయాన్‌టెక్ సంస్థలు తాజాగా చేసిన పరిశోధనలో సమాధానాలు లభించినట్లే కనిపిస్తోంది.
తమ క్లినికల్ ట్రయల్స్‌లో 5 నుంచి 11 సంవత్సరాల వయసున్న చిన్నారులపై ఫైజర్ టీకా సత్ఫలితాలను చూపినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ చిన్నారుల్లో స్థిరమైన రోగనిరోధక స్పందన కనిపించిందని వివరించారు. అయితే వీరికి ఇచ్చిన టీకా డోసు సాధారణంగా 12 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చే దాని కన్నా కొంత తక్కువగా ఉందని తెలియజేశారు.
ఈ క్లినికల్ ట్రయల్స్ డేటాను సాధ్యమైనంత త్వరగా అమెరికా సహా యూరోపియన్ యూనియన్, ఇతర ప్రపంచ దేశాల్లోని రెగ్యులేటరీ సంస్థలకు సమర్పిస్తామని ఫైజర్ కంపెనీ తెలిపింది. ఇలా చిన్నారులపై చేసిన ప్రయోగ ఫలితాల్లో ఇవే మొట్టమొదటి ఫలితాలు. మోడెర్నా కూడా 6 నుంచి 11 ఏళ్ల పిల్లలపై పరిశోధన చేస్తోంది. అయితే ఈ అధ్యయనం ఇంకా పూర్తి కాలేదు.
ఫైజర్, మోడెర్నా టీకాలను ఇప్పటికే 12 ఏళ్లు పైబడిన వారందరికీ అందిస్తున్నారు. మామూలు కరోనా వైరస్ వల్ల చిన్నారులకు పెద్దగా ప్రమాదం లేదని డేటా తెలుపుతోంది. కానీ ప్రస్తుతం ప్రపంచంలో విజృంభిస్తున్న డెల్టా సహా పలు వేరియంట్ల వల్ల ప్రమాదం ఉండొచ్చని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.