Vijayawada: విజయవాడ కేంద్రంగా డ్రగ్స్ కార్యకలాపాలు సాగుతున్నాయన్నది అవాస్తవం: నగర పోలీస్ కమిషనర్

- గుజరాత్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్న అధికారులు
- పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.9 వేల కోట్లు
- కేసులో విజయవాడ పేరు!
- ఓ కంపెనీ అడ్రస్ లో నగరం పేరుందున్న సీపీ
- అంతకుమించి ఎలాంటి సంబంధంలేదని స్పష్టీకరణ
గుజరాత్ లోని ఓ పోర్టులో రూ.9 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడగా, ఆ వ్యవహారంలో ఏపీ నగరం విజయవాడ పేరు వినిపించడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు వివరణ ఇచ్చారు. విజయవాడ కేంద్రంగా డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలు సాగుతున్నాయన్నది అవాస్తవం అని స్పష్టం చేశారు. గుజరాత్ నుంచి విజయవాడకు డ్రగ్స్ రవాణా చేస్తున్నారన్నదాంట్లో నిజంలేదని అన్నారు. గుజరాత్ లోని ముంద్రా పోర్టు నుంచి ఢిల్లీకి తరలించే యత్నంలోనే భారీగా హెరాయిన్ పట్టుబడిందని వివరించారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆషీ ట్రేడింగ్ కంపెనీ లైసెన్స్ లో విజయవాడ అనే అడ్రస్ ఉండడం తప్ప, ఇంకే విధంగానూ నగరంతో డ్రగ్స్ కు సంబంధం లేదని సీపీ పేర్కొన్నారు. అసలు ఆ కంపెనీ యజమాని ఎప్పుడో చెన్నైలో స్థిరపడ్డారని, విజయవాడలో డ్రగ్స్ కు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు లేవని తెలిపారు.