Perni Nani: ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి అందరూ మద్దతు ఇస్తున్నారు: మంత్రి పేర్ని నాని

Minister Perni Nani talks concludes with cine reps

  • సినీ ప్రతినిధులతో మంత్రి పేర్ని నాని సమావేశం
  • ఎగ్జిబిటర్ల సాధకబాధకాలను తెలుసుకున్నాం  
  •  తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడి
  • చిరంజీవి అంటే సీఎం జగన్ కు గౌరవం, సోదర భావం వున్నాయన్న మంత్రి 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినీ ఎగ్జిబిటర్లు, సినీ ప్రతినిధులతో ఏపీ మంత్రి పేర్ని నాని నేడు సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సినిమా ఎగ్జిబిటర్ల సాధకబాధకాలను వివరంగా తెలుసుకున్నామని వెల్లడించారు. సినిమా ప్రదర్శనల అంశంలో ఎగ్జిబిటర్లకు ఉన్న సమస్యలు, ఏపీలో సినిమాలు తీసేటప్పుడు నిర్మాతలు కోరుకునే సౌలభ్యాలను అన్నీ నమోదు చేసుకుని సమీక్ష జరుపుతామని తెలిపారు. ఈ అంశాలను సీఎం జగన్ కు నివేదిస్తామని వివరించారు.

అంతేకాకుండా, ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకానికి ఎగ్జిబిటర్లు, ఫిలించాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు తమ సంపూర్ణ మద్దతు తెలిపారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై సమీక్షిస్తున్నామని, సూచనలు అందించేందుకు సినీ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సగటు సినీ ప్రేక్షకుడికి వినోదం అందుబాటులో ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని, అదే సమయంలో ఆన్ లైన్ టికెటింగ్ విధానం పారదర్శకంగా ఉండాలనేది తమ ప్రయత్నమని స్పష్టం చేశారు. తాము ఈ అంశంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, అన్నివైపుల నుంచి సానుకూల స్పందన రావడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరలే ఉంటాయని వెల్లడించారు.

ప్రజలకు ఇబ్బందిలేనటువంటి విధానం తీసుకురావాలని అగ్రహీరో చిరంజీవి కోరారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. చిరంజీవి అంటే సీఎం జగన్ కు గౌరవం, సోదర భావం వున్నాయని, తప్పకుండా మెరుగైన నిర్ణయాలే తీసుకుంటామని వివరించారు.

ఇవాళ్టి సమావేశంలో... తమకు బెనిఫిట్ షోలు కావాలని ఒక్కరు కూడా అడగలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ ఎవరూ అడగలేదని అన్నారు. రోజుకు 4 ప్రదర్శనలు చాలన్నదే అందరి అభిప్రాయం అని తెలిపారు.

Perni Nani
Online Ticketing
Cinema
Andhra Pradesh
Tollywood
  • Loading...

More Telugu News