Gandham Bhuvan: అతి చిన్న వయసులో మౌంట్ ఎల్ బ్రస్ ను అధిరోహించిన ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు తనయుడు
- పిట్ట కొంచెం కూత ఘనం
- ఎనిమిదేళ్ల వయసుకే పర్వతారోహణ
- మూడో తరగతి చదువుతున్న గంధం భువన్
- మౌంట్ ఎల్ బ్రస్ ఎత్తు 5,642 మీటర్లు
- ఇది యూరప్ లోనే ఎత్తయిన పర్వతం
ఏపీ ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు కుమారుడు గంధం భువన్ రికార్డు నెలకొల్పాడు. యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తయిన శిఖరంగా చెప్పుకునే మౌంట్ ఎల్ బ్రస్ ను భువన్ విజయవంతంగా అధిరోహించాడు. తద్వారా ఈ పర్వతాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. రష్యాలోని మౌంట్ ఎల్ బ్రస్ పర్వతం ఎత్తు 5,642 మీటర్లు. ఇంతజేసీ గంధం భువన్ వయసు 8 సంవత్సరాల 3 నెలలు మాత్రమే. చదివేది 3వ తరగతి. ఇంత చిన్నవయసులో అద్భుతం చేసిన మాస్టర్ భువన్ పై అభినందనల వర్షం కురుస్తోంది.
భువన్ తండ్రి గంధం చంద్రుడు మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. భువన్... క్రీడల పట్ల ఎంతో ఆసక్తి చూపించడాన్ని గమనించిన గంధం చంద్రుడు అనంతపురం ఆర్డీటీ స్పోర్ట్స్ కోచ్ శంకరయ్య వద్ద శిక్షణ ఇప్పించారు. శంకరయ్య పర్వాతారోహకుడు కూడా కావడంతో, భువన్ కు అందులోనూ మెళకువలు నేర్పించారు.
భువన్ పర్వతారోహణకు సంబంధించి కడప జిల్లా గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో శంకరయ్య నేతృత్వంలో ఓనమాలు దిద్దుకున్నాడు. అటుపై భువనగిరిలోని ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ సంస్థ కోచ్ శంకరబాబు వద్ద కూడా భువన్ శిక్షణ పొంది పిన్నవయసులోనే ఎత్తయిన పర్వతాలు ఎక్కేంత నైపుణ్యం, శక్తిసామర్థ్యాలు సాధించాడు. తాజాగా గంధం భువన్ మౌంట్ ఎల్ బ్రస్ ను అధిరోహించిన సమయంలో అతడి వెంట కోచ్ శంకరయ్య, వర్మ, నవీన్ మల్లేశ్ లతో కూడిన బృందం కూడా ఉంది.