Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ పాలనకు ప్రజలు మరోసారి ఆశీస్సులు అందించారు: సజ్జల
- ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు
- వైసీపీ జోరు.. సజ్జల ప్రెస్ మీట్
- విశ్వసనీయతకు పట్టం కట్టారని వ్యాఖ్య
- టీడీపీకి ఇంకా బుద్ధి రాలేదని ఆగ్రహం
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల సరళి పట్ల వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పరిషత్ ఎన్నికల్లో తమదే విజయం అని పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనకు మరోసారి ప్రజల నుంచి ఆశీస్సులు అందాయని వెల్లడించారు. పేదల జీవితాల్లో కాంతులు నింపేందుకు సీఎం జగన్ చేస్తున్న కృషిని ప్రజలు శభాష్ అంటూ మెచ్చుకున్నారని, అందుకు తాజా ఫలితాల ప్రభంజనమే నిదర్శనమని పేర్కొన్నారు.
కొన్ని పార్టీలకు ఈ ఫలితాలు గుణపాఠాలని పరోక్షంగా ప్రధాన విపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియ 2020లో ప్రారంభమై 2021లో ముగిసిందంటే అది చంద్రబాబు చలవేనని సజ్జల వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తగా పనిచేశాడని, చంద్రబాబు కోర్టులకు వెళ్లి ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలు తమ పక్షానే ఉన్నారని, విశ్వసనీయత నచ్చితే ప్రజలు ఎలా పట్టం కడతారో మరోసారి స్పష్టమైందని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లోనూ టీడీపీ గాంభీర్యం ప్రదర్శిస్తోందని, దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికలు పెట్టాలని అచ్చెన్నాయుడు అంటున్నాడని, గత ఎన్నికల్లో ఘోరంగా ఓడినా బుద్ధి రాలేదని సజ్జల విమర్శించారు.
కాగా, ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలను ఓసారి పరిశీలిస్తే... ఓట్లు లెక్కిస్తున్న మొత్తం ఎంపీటీసీ స్థానాలు 9589 కాగా, వైసీపీ 7,623 స్థానాలను చేజిక్కించుకుంది. టీడీపీ 848, జనసేన 119, బీజేపీ 32, ఇతరులు 198 స్థానాల్లో గెలిచారు. 641 జడ్పీటీసీ స్థానాలకు గాను వైసీపీ 530, టీడీపీ 6, ఇతరులు 2 స్థానాలు గెలిచారు. మిగిలిన స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.