MPTC: ఆంధ్రప్రదేశ్ లో రేపు పరిషత్ ఓట్ల లెక్కింపు... విశాఖలో 29 మంది ఏజెంట్లకు కరోనా
- కోర్టు తీర్పుతో పరిషత్ ఓట్ల లెక్కింపుకు మార్గం సుగమం
- కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి
- ఆదివారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు
- ఏజెంట్లకు, సిబ్బందికి కరోనా టెస్టులు
హైకోర్టు తీర్పు నేపథ్యంలో రేపు ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ షురూ కానుంది. కాగా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ ఏజెంట్లకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
విశాఖలో 90 మంది కౌంటింగ్ ఏజెంట్లకు కరోనా టెస్టులు నిర్వహించగా, వారిలో 29 మందికి పాజిటివ్ అని వెల్లడి కావడం కలకలం రేపింది. కరోనా సోకిన వారిని ఐసోలేషన్ కు తరలించాలని విశాఖ జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వచ్చినవారినే కౌంటింగ్ ఏజెంట్లుగా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఏపీలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలు, 660 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాల్లో 2,371, జడ్పీటీసీ స్థానాల్లో 126 ఏకగ్రీవం అయ్యాయి.