China: అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగించుకుని.. మూడు నెలల తర్వాత భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు!
- భూమికి 360 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష కేంద్రం
- సుదీర్ఘకాలంపాటు రోదసీలో గడిపిన చైనీయులుగా రికార్డు
- వచ్చే ఏడాది నాటికి ‘తియాన్హే’ను పూర్తి చేయాలని నిర్ణయం
మూడు నెలలపాటు రోదసీలో గడిపిన ముగ్గురు చైనా వ్యోమగాములు నిన్న సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. వీరి రాకతో అంతరిక్ష యాత్ర విజయవంతమైందని చైనా ప్రకటించింది. వీరు సురక్షితంగా భూమికి చేరుకోవడంతో సుదీర్ఘంగా అంతరిక్షంలో గడిపిన చైనీయులుగా నీ హైషెంగ్, లియు బోమింగ్, టాంగ్ హోంగ్బో చరిత్ర సృష్టించారు. వీరు ప్రయాణించిన షెంఝౌ-12 వ్యోమనౌక ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియాలో దిగింది.
భూ కక్ష్యలో చైనా సొంతంగా నిర్మించుకుంటున్న అంతరిక్ష కేంద్రం తియాన్హే మాడ్యూల్‌లో వీరు మూడు నెలలపాటు గడిపారు. భూమికి 360 కిలోమీటర్ల ఎత్తులో చైనా ఈ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ప్రపంచం మొత్తాన్ని వీక్షించేందుకు వీలు కల్పించేలా ‘ఆకాశ నేత్రం’గా ఈ ప్రాజెక్టును చైనా పరిగణిస్తోంది. వచ్చే ఏడాది నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చైనా గట్టి పట్టుదలగా ఉంది.