FAcebook: 14 ఏళ్ల క్రితం విడిపోయన తల్లీకూతుళ్లను కలిపిన ఫేస్‌బుక్
- తల్లిని ఫేస్‌బుక్‌లో పలకరించిన కుమార్తె
- అధికారుల నిఘాలో సరిహద్దుకు వెళ్లి ఆమెను కలిసిన తల్లి
- అన్ని పత్రాలు పరిశీలించి తల్లీకూతుళ్లుగా నిర్ధారణ
14 ఏళ్ల క్రితం విడిపోయిన తల్లీకూతుళ్లను ఫేస్‌బుక్ కలిపింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు వారిపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఏంజెలికా వెన్సెస్ సాల్గాడో అనే మహిళ నివసిస్తోంది.
ఈ నెల 2వ తేదీన ఆమెను ఫేస్‌బుక్‌లో ఒక 19 ఏళ్ల యువతి పలకరించింది. తనను జాక్వెలైన్ హెర్నాండెజ్‌గా సదరు యువతి పరిచయం చేసుకుంది. తాను గతంలో తప్పిపోయిన మీ కూతురినని, ప్రస్తుతం మెక్సికోలో ఉంటున్నానని చెప్పింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏంజెలికా ఆనందానికి అవధులు లేవు.
ఆమె చెప్పిన ఆనవాళ్లతో తను తన బిడ్డేనని నిర్ధారించుకుని విషయాన్ని స్థానిక అధికారులకు తెలిపింది. అధికారుల సమక్షంలో ఇద్దరూ మెక్సికో సరిహద్దుల్లో కలుసుకున్నారు. జాక్వెలైన్ వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలను సరిచూశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సహా ఇతర విభాగాల అధికారులు కూడా జాక్వెలైన్ గురించి దర్యాప్తు చేశారు.
చివరకు వాళ్లిద్దరూ తల్లీకూతుళ్లేనని తేల్చారు. దీంతో ఏంజెలికా ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు జాక్వెలైన్‌ను ఆమె తండ్రి పాబ్లో హెర్నాండెజ్ ఎత్తుకెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ కథ గురించి తెలిసిన నెటిజన్లు ఈ తల్లీకూతుళ్లపై అభినందల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకాలం తల్లి లేక జాక్వెలైన్, కుమార్తె ఆచూకీ తెలియక ఏంజెలికా పడిన బాధ ఈ రోజుతో తీరిందంటూ కామెంట్లు చేస్తున్నారు.