Ramiz Raja: మీరు ఏ ప్రపంచంలో ఉన్నారు?... చివరి నిమిషంలో టూర్ రద్దు చేసుకోవడంపై న్యూజిలాండ్ పై పాక్ క్రికెట్ చీఫ్ మండిపాటు
- వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు టూర్ రద్దు
- నిఘా వర్గాల హెచ్చరిక
- టూర్ నుంచి వైదొలగుతున్నట్టు కివీస్ ప్రకటన
- ఐసీసీ సమావేశంలో చూసుకుంటామన్న రమీజ్ రాజా
భద్రతా కారణాల రీత్యా న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకోవడం తెలిసిందే. నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో తాము పర్యటన నుంచి వైదొలుగుతున్నట్టు న్యూజిలాండ్ ప్రకటించింది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త చీఫ్ రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ పై త్వరలోనే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
"ఇది చాలా విచారించదగ్గ రోజు. అభిమానులు, మా ఆటగాళ్ల పరిస్థితికి చింతిస్తున్నాను. భద్రతాపరమైన కారణాలంటూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని టూర్ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోవడం తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. మీకొచ్చిన భద్రతాపరమైన హెచ్చరికను ఎవరితో పంచుకున్నారు? అసలు, న్యూజిలాండ్ ఏ ప్రపంచంలో ఉంది? ఐసీసీ సమావేశంలో న్యూజిలాండ్ మా ఆగ్రహాన్ని తప్పక చవిచూస్తుంది" అని రమీజ్ రాజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, పాకిస్థాన్ పర్యటన నుంచి తమ జట్టు వైదొలగడాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో పాటు ప్రధాని జసిండా ఆర్డెన్ కూడా సమర్థించారు. ఆటగాళ్ల భద్రత తమకు పరమావధి అని ప్రధాని ఆర్డెన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడినట్టు ఆమె వెల్లడించారు. న్యూజిలాండ్ క్రికెట్ సీఈవో డేవిడ్ వైట్ స్పందిస్తూ, తమ నిర్ణయం పాక్ క్రికెట్ బోర్డును బాధిస్తుందన్న విషయం తమకు తెలుసని, కానీ ఆటగాళ్ల భద్రత పరంగా ఇదే అత్యుత్తమ నిర్ణయం అని పేర్కొన్నారు.