Punnaiah Chowdary: సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన జాతీయ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు పున్నయ్య చౌదరి
- బ్యాడ్మింటన్ అకాడమీకి రెండెకరాల భూమి
- గుంటూరు నల్లపాడులో స్థలం కేటాయింపు
- నిన్నటి క్యాబినెట్ భేటీలో నిర్ణయం
- హర్షం వ్యక్తం చేసిన బ్యాడ్మింటన్ ప్రముఖుడు పున్నయ్య
నిన్న జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అకాడమీ ఏర్పాటుకు రెండెకరాల భూమి కేటాయించారు. దీనిపై భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఉపాధ్యక్షుడు, ఏపీ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి పున్నయ్య చౌదరి స్పందించారు. సీఎం జగన్ కు బ్యాడ్మింటన్ వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
బ్యాడ్మింటన్ అకాడమీ కోసం ప్రభుత్వం భూమిని కేటాయించడం హర్షణీయమని పేర్కొన్నారు. గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని పున్నయ్యచౌదరి వెల్లడించారు. ఈ అకాడమీని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, శిక్షకుడు సుధాకర్ రెడ్డి పేరిట ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సుధాకర్ రెడ్డి అర్ధాంగి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సావిత్రి నూతనంగా ఏర్పాటయ్యే ఈ అకాడమీకి సీఈఓగా వ్యవహరిస్తారని వివరించారు.
ఈ అకాడమీ ద్వారా ఎంతోమంది బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఉన్నతస్థాయికి చేర్చవచ్చని పున్నయ్య వివరించారు. ఏపీలో క్రీడల అభివృద్ధి పట్ల సీఎం జగన్ చూపిస్తున్న శ్రద్ధాసక్తులు అభినందనీయమని పేర్కొన్నారు.