Sonu Sood: పన్ను ఎగవేత ఆరోపణలు.. సోనూసూద్ ఇళ్లపై మళ్లీ ఐటీ దాడులు.. సాయంత్రం అధికారుల మీడియా సమావేశం
- వరుసగా మూడో రోజు సోదాలు
- సోనూసూద్ బ్యాంక్ ఖాతాలపై ఆరా
- సోనూ ఆప్‌లో చేరతారన్న ప్రచారం నేపథ్యంలో దాడులు
సినీ నటుడు సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు నిన్న, మొన్న దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. వరుసగా మూడోరోజు కూడా అధికారులు సోదాలు కొనసాగిస్తుండడం గమనార్హం. సోనూసూద్ నివాసానికి చేరుకున్న ఆదాయపు పన్ను అధికారులు ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ముంబై, నాగ్‌పూర్, జైపూర్‌లలో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.
సోనూసూద్ భారీ మొత్తంలో పన్ను ఎగవేశాడని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాల నుంచి వచ్చే పేమెంట్లతో పాటు ఆయన వ్యక్తిగత ఆదాయంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సమాచారం. అంతేగాక, సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాలపై చేసిన దాడులపై ఐటీ అధికారులు ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి, పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఓ స్థిరాస్తి సంస్థతో సోనూసూద్ ఒప్పందం కుదుర్చుకుని పన్ను ఎగవేతకు పాల్పడ్డారని కూడా అధికారులు అనుమానిస్తున్నారు. సోనూసూద్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతోన్న వేళ ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతుండడంతో బీజేపీపై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.