Corona Virus: వచ్చే రెండు నెలలు కీలకం.. కరోనాపై ఆరోగ్య శాఖ ప్రకటన
- కేరళలో తగ్గుతున్న పాజిటివ్ కేసులు
- వచ్చే పండుగల సీజన్‌లో అప్రమత్తత అవసరం
- జాతీయ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ అధినేత వీకే పాల్ సూచన
దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇప్పటి వరకూ ఎక్కువగా కరోనా కేసులు నమోదయిన కేరళలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే దేశంలో మొత్తం నమోదవుతున్న కేసుల్లో 68 శాతం ఈ రాష్ట్రం నుంచే వస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుతం కేరళలో 1.99 లక్షల యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు చెప్పింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, మిజోరాం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పదివేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ వివరించారు. అదే సమయంలో వచ్చే పండుగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు.
ఈ విషయంపై నీతి ఆయోగ్ సభ్యుడు, జాతీయ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ అధినేత డాక్టర్ వీకే పాల్ కూడా స్పందించారు. వచ్చే రెండు, మూడు నెలలు చాలా కీలకమని ఆయన చెప్పారు. ఈ సమయంలో కరోనా కేసులు పెరగకుండా చూసుకోవాలని సూచించారు.
కరోనా విషయంలో అక్టోబరు, నవంబరు చాలా కీలకమైన సమయమని వీకే పాల్ అభిప్రాయపడ్డారు. ఈ పండుగల సీజన్‌లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని, కరోనా కేసులు పెరగకుండా చూసుకోవాలని ఆయన అన్నారు.