Andhra University: ఆంధ్ర యూనివర్శిటీ వద్ద నిరసన చేపట్టిన ఆఫ్ఘనిస్థాన్ విద్యార్థులు
- తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన
- తాలిబన్ల పాలనను ఆమోదించవద్దని ఐరాసకు విన్నపం
- తాలిబన్లకు పాకిస్థాన్ సహకారాన్ని ఆపేయాలని డిమాండ్
ఆప్ఘనిస్థాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆ దేశ ప్రజలు తాలిబన్ల పాలనను ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా ఆప్ఘన్లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా విశాఖలోని ఆంధ్ర యూనివర్శిటీలో చదువుతున్న ఆప్ఘనిస్థాన్ విద్యార్థులు శాంతియుత నిరసన చేపట్టారు.
యూనివర్శిటీ మెయిన్ గేట్ వద్ద ఆప్ఘనిస్థాన్ జెండాను వారు ఎగురవేశారు. తాలిబన్ల పాలనలో జరుగుతున్న అరాచకాలను ఖండించారు. తాలిబన్ల అరాచకాలను తిప్పి కొట్టాలని ప్రపంచ దేశాలను కోరారు. తమ దేశంలో మహిళలకు రక్షణ కల్పించాలని అన్నారు. తాలిబన్ల పాలనకు ఐక్యరాజ్యసమితి ఆమోదం తెలపకూడదని విన్నవించారు. తాలిబన్లకు పాకిస్థాన్ సహకారాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు.