YS Sharmila: అర్ధరాత్రి 2 గంటలకు నా దీక్ష భగ్నం చేసి, హౌస్ అరెస్ట్ చేయడం దారుణం: షర్మిల
- చైత్ర కుటుంబానికి న్యాయం చేయాలని షర్మిల దీక్ష
- రాత్రి దీక్షను భగ్నం చేసిన పోలీసులు
- కేసీఆర్, కేటీఆర్ నిరంకుశపాలనకు నిదర్శనమన్న షర్మిల
హైదరాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి చైత్ర కుటుంబాన్ని వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల నిన్న పరామర్శించిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబానికి రూ. 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు తాను ఇక్కడే దీక్ష చేపడుతున్నానని ఆమె ప్రకటించారు. అనంతరం నిరవధిక దీక్షకు కూర్చున్నారు. అయితే రాత్రి ఆమె దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అక్కడి నుంచి ఇంటికి తరలించారు. తన పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై షర్మిల మండిపడ్డారు.
చైత్రకు న్యాయం చేయాలని నిన్నటి నుంచి శాంతియుతంగా దీక్ష చేస్తుంటే... ప్రభుత్వం అర్ధరాత్రి 2 గంటలకు దీక్షను భగ్నం చేసి, ఇంటికి తరలించి, హౌస్ అరెస్ట్ చేయడం అక్రమమని షర్మిల మండిపడ్డారు. ఇంత దారుణం జరిగినా కేసీఆర్, కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం నిరంకుశపాలనకు నిదర్శనమని అన్నారు. తన దీక్షను భగ్నం చేస్తున్న వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.