Corona Virus: కరోనా నిబంధనలతో పెరిగిన నేరాలు!
- నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదికలో వెల్లడి
- నేరాల్లో నమోదైన 28 శాతం పెరుగుదల
- 2020లో 10 లక్షలపైగా ‘ఇతర ఐపీసీ నేరాలు’
రెండేళ్లుగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. మన దేశంలో కూడా గతేడాది మార్చి 23న కరోనా భయంతో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కరోనాను నియంత్రించడం కోసం ప్రభుత్వం పలు నిబంధనలు ఏర్పాటు చేసింది. మాస్కు తప్పనిసరి చేయడం, సోషల్ డిస్టెన్సింగ్ వీటిలో ప్రధానమైనవి.
అలాగే లాక్‌డౌన్‌లో బయటకు రాకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ చాలా మంది పోలీసుల దృష్టిలో పడ్డారు. ఈ నేపథ్యంలో కరోనా వల్ల దేశంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగినట్లు సమాచారం. తాజాగా నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలో ఈ విషయం స్పష్టమైంది.
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన కేసులను ‘ఇతర ఐపీసీ నేరాల’ విభాగంలో నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేరాల సంఖ్య 2019లో 2,52,268గా ఉండగా, ఇది 2020లో 10,62,399కి చేరినట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో లాక్‌డౌన్ కారణంగా మహిళలపై నేరాల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది.