Pushpasreevani Pamula: ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి కుల ధ్రువీకరణ కేసు.. వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశం

AP Deputy CM Pushpa Sreevani Caste Case in Ap High Court

  • డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదంటూ న్యాయవాది ఫిర్యాదు
  • ఆమె ఎస్టీ అని తేల్చిన జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ
  • మంత్రి తనకు తానే విచారణ చేయించడం చట్ట వ్యతిరేకమన్న న్యాయవాది
  • విచారణను వారం రోజులు వాయిదా వేసిన కోర్టు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కుల ధ్రువీకరణకు సంబంధించిన కేసు విచారణను ఏపీ హైకోర్టు వారం రోజులపాటు వాయిదా వేసింది. అంతకుముందు.. మంత్రి కుల ధ్రువీకరణ విషయంలో ‘అప్పీల్ అథారిటీ’ విచారణకు సంబంధించిన వివరాలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో నిన్న హైకోర్టులో విచారణ ప్రారంభం కాగా న్యాయవాది బి.శశిభూషణ్‌రావు వాదనలు వినిపించారు.

ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఎస్టీ కాదని, ఆమె కుల ధ్రువీకరణకు సంబంధించి వాస్తవం తేల్చాలంటూ న్యాయవాది రేగు మహేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని కోర్టుకు తెలిపారు. అయితే, జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ ఆమె ఎస్టీ అని తేల్చిందని పేర్కొన్నారు. దీంతో పిటిషనర్ జూన్ 10న అప్పీల్ దాఖలు చేసినట్టు చెప్పారు.  

అయితే, కుల ధ్రువీకరణ విషయంలో మంత్రి తానే విచారణ చేయించడం చట్టానికి, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి ఏపీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనల మేరకు అప్పీల్ అథారిటీని ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రిని ఆదేశించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు

దీనికి స్పందించిన న్యాయమూర్తి జస్టిస్. ఎం.సత్యనారాయణమూర్తి.. పత్రాలను పరిశీలిస్తే రాష్ట్ర స్థాయి పునస్సమీక్ష కమిటీ వద్ద అప్పీల్ చేసినట్టుగా ఉందన్నారు. కాబట్టి అప్పీల్‌ను ఉపసంహరించుకుని సంబంధిత అథారిటీ ముందు దాఖలు చేసుకోవాలని సూచించారు. అప్పీలు అథారిటీ విచారణకు సంబంధించిన వివరాలను తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News