Amaravati: బలరాముడు చూపిన బాటలోనే అమరావతి రైతుల దీక్ష: భారతీయ కిసాన్ సంఘ్ నేత కుమారస్వామి
![Amaravati farmers will win end of the day said kumaraswamy](https://imgd.ap7am.com/thumbnail/cr-20210913tn613ec2e185ee9.jpg)
- ఆదివారానికి 635వ రోజుకు చేరుకున్న దీక్ష
- బలరాముడి జయంతిని పురస్కరించుకుని పూజలు
- అంతిమ విజయం రైతులదేనన్న కుమారస్వామి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన నిరసన నిన్నటికి 635వ రోజుకు చేరుకుంది. ఆదివారం బలరాముడి జయంతిని పురస్కరించుకుని తుళ్లూరులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు.
ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ నాయకుడు కుమారస్వామి మాట్లాడుతూ.. అమరావతి రైతులు, మహిళల దీక్షకు బలరాముడే ఆదర్శమని అన్నారు. ఎప్పటికైనా ధర్మానిదే విజయమని మహాభారత యుద్ధ సమయంలో బలరాముడు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన చూపిన మార్గంలోనే రైతులు ముందుకు వెళుతున్నారని అన్నారు. విజయం చివరికి వారికే సిద్ధిస్తుందన్నారు. పార్టీలు, ప్రాంతాలు, కులమతాలను పక్కనపెట్టి అమరావతి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.