Trivikrama Varma: సామూహిక అత్యాచార ఘటనపై ప్రకటన చేసిన గుంటూరు రేంజి డీఐజీ త్రివిక్రమ వర్మ
- మేడికొండూరు మండలంలో ఘటన
- భర్తను కట్టేసి భార్యపై అత్యాచారం
- పెళ్లికి వెళ్లి వస్తుండగా అఘాయిత్యం
- పోలీసులు వెంటనే స్పందించారన్న డీఐజీ
- ఘటనలో పోలీసుల అలసత్వంలేదని స్పష్టీకరణ
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద ఓ మహిళపై దారుణ అత్యాచారం జరగడం తెలిసిందే. పెళ్లికి హాజరై తిరిగి వస్తున్న దంపతులను అటకాయించిన దుండగులు, భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై గుంటూరు రేంజి డీఐజీ త్రివిక్రమ వర్మ ప్రకటన చేశారు. బాధితులు సత్తెనపల్లికి రాగానే పోలీసులు వెంటనే స్పందించారని, వివరాలు తీసుకుని మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. నిందితుల కోసం సత్తెనపల్లి పోలీసులు ఘటన స్థలికి వెళ్లి పరిశీలన చేశారని వెల్లడించారు.
ఈ ఘటనపై ఐపీసీ 376 డి, 394, 342 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సామూహిక అత్యాచార ఘటనలో పోలీసుల అలసత్వం లేదని స్పష్టం చేశారు. ఘటన స్థలికి వెళ్లలేని పరిస్థితుల్లోనూ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అన్నారు.