YS Vivekananda Reddy: వివేకా హత్యకు ముందు ఆయన ఇంట్లోని శునకాన్ని కారుతో ఢీకొట్టి చంపిన నిందితులు: ఉమాశంకర్ కస్టడీ పిటిషన్‌లో సీబీఐ

CBI Arrested Uma Shankar in YS Viveka Murder Case

  • విచారణ అనంతరం ఉమాశంకర్‌రెడ్డి అరెస్ట్
  • వివేకాను హత్య చేసేందుకు ఉమాశంకర్, సునీల్ యాదవ్ బైక్‌పై వెళ్లారన్న సీబీఐ
  • ఐదు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు
  • ఈ నెల 23 వరకు రిమాండ్

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక అనుమానితుడిగా భావిస్తున్న ఉమాశంకర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది. సింహాద్రిపురం మండలం కుంచేకులకు చెందిన ఉమాశంకర్‌ను ఉదయం నుంచి విచారించిన అధికారులు సాయంత్రం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం పులివెందుల కోర్టులో ప్రవేశపెట్టి ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు.

వివేకానందరెడ్డి పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డి సోదరుడే ఉమాశంకర్‌రెడ్డి. వివేకానందరెడ్డి హత్యకేసులో ఉమాశంకర్, సునీల్ యాదవ్ పాత్ర ఉందనడానికి ఆధారాలు ఉన్నాయని పులివెందుల కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది. వివేకా హత్య కేసులో ఉమాశంకర్ పాత్ర ఉన్నట్టు సునీల్, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి తమ వాంగ్మూలాల్లో చెప్పారని తెలిపింది. వివేకాను హత్య చేయడానికి ముందు వీరిద్దరూ కలిసి ఆయన ఇంట్లోని శునకాన్ని కారుతో ఢీకొట్టి చంపారని పేర్కొన్నారు.

వివేకాను హత్య చేసేందుకు వీరిద్దరూ కలిసి బైక్‌పై వెళ్లారని, హత్య తర్వాత ఉమాశంకర్‌ బైక్‌లో గొడ్డలి పెట్టుకుని పారిపోయాడని సీబీఐ అందులో వివరించింది. బైక్‌ను, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. గుజరాత్ నుంచి ఫోరెన్సిక్ నివేదికను కూడా తెప్పించామన్న సీబీఐ గత నెల 11న ఉమాశంకర్ ఇంటి నుంచి రెండు చొక్కాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. ఇంకా మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, కాబట్టి ఉమాశంకర్‌ను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ ఆ పిటిషన్‌లో అభ్యర్థించింది. కాగా, ఉమాశంకర్‌కు కోర్టు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించడంతో పులివెందుల నుంచి కడప జిల్లా జైలుకు తరలించారు.

YS Vivekananda Reddy
Murder Case
Kadapa District
Umashakar Reddy
CBI
  • Loading...

More Telugu News