CM Jagan: బ్యాంకర్ల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమర్థ పనితీరు చూపింది: సీఎం జగన్
- రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశం
- ముగిసిన సమావేశం
- బ్యాంకర్ల నుంచి మరింత సహకారం కోరిన సీఎం
- పలు రంగాల వారికి అండగా నిలవాలని విజ్ఞప్తి
ఏపీ సీఎం జగన్ నేడు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. కొద్దిసేపటి కిందట ఈ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, బ్యాంకర్ల పనితీరును ప్రశంసించారు. బ్యాంకర్ల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమర్థ పనితీరు చూపిందని వెల్లడించారు. 2020-21లో దేశ జీడీపీ 7.25 శాతం తగ్గితే, ఏపీలో 2.58 శాతం తగ్గిందని వివరించారు. గత సంవత్సరంతో పోల్చితే టర్మ్ రుణాలు రూ.3.237 కోట్లు తక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు.
సాగు రంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ జరిగిందని, పంట రుణాలు 10.49 శాతం అధికంగా ఇచ్చామని సీఎం తెలిపారు. కౌలు రైతులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని, కౌలు రైతులకు రుణాలపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లను కోరారు. మహిళా సాధికారిత కోసం బ్యాంకర్ల సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఇంటి నిర్మాణానికి రూ.35 వేల రుణం ఇచ్చేందుకు బ్యాంకులు చొరవచూపాలని సూచించారు. బ్యాంకులు 3 శాతం వడ్డీకి ఇస్తే, మిగిలిన వడ్డీ ప్రభుత్వం భరిస్తుందని సీఎం జగన్ ప్రతిపాదించారు. చిరువ్యాపారులకు రుణాల మంజూరుపైనా బ్యాంకులు సానుకూల ధోరణితో వ్యవహరించాలని, బ్యాంకర్లు ఎంఎస్ఎంఈలకు అండగా నిలవాలని కోరారు.