Vishnu Vardhan Reddy: ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాలను ఆరాధించవచ్చని కోర్టు చెప్పినా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు: బీజేపీ నేత విష్ణు
- వినాయకచవితి నేపథ్యంలో విష్ణు వ్యాఖ్యలు
- బాధ్యతారాహిత్యం అంటూ విమర్శలు
- వైసీపీ పాలకుల దురహంకారం అంటూ మండిపాటు
- పలువర్గాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి వినాయకచవితి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాలను ఆరాధించుకోవచ్చని న్యాయస్థానం తీర్పు ఇచ్చినా భక్తులను కొన్నిచోట్ల అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇది బాధ్యతా రాహిత్యమని విష్ణు విమర్శించారు.
వినాయకచవితి విషయంలో హైకోర్టు అక్షింతలు వేసినట్టు ప్రభుత్వం భావించకపోవడం అనేది వైసీపీ పాలకుల దురహంకారానికి నిదర్శనం అని విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వ దురుద్దేశం బహిర్గతమైందని అన్నారు. వినాయక విగ్రహాల తయారీదారులు, పత్రి అమ్మకందారులు, ఇతర వర్గాల వారు ప్రభుత్వ నిర్ణయం కారణంగా నష్టపోయారని, వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని విష్ణు డిమాండ్ చేశారు.