Mukesh Ambani: ‘పేలుడు పదార్థాల కారు’ కేసు.. నాడు గుజరాత్ పర్యటనను రద్దు చేసుకున్న నీతా అంబానీ!
- వెల్లడించిన అంబానీ ఇంటి సెక్యూరిటీ హెడ్
- ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో అతని వాంగ్మూలం
- ప్రధాన నిందితుడిగా ఎన్ఐఏ రిపోర్టులో సచిన్ వాజే
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ ఇల్లు ‘ఆంటీలియా’ ముందు పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీ కారు లభించిన కేసులో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన చార్జ్‌షీట్‌ను ముంబైలోని ప్రత్యేక కోర్టు ముందు ఎన్ఐఏ ఉంచింది.
దీని ప్రకారం, ఈ ఘటన జరిగిన రోజున ముఖేశ్ అంబానీ భార్య నీతా.. గుజరాత్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ ఈ కారు కనిపించడంతో ఆమె తన పర్యటన రద్దు చేసుకున్నట్లు ఆంటీలియా సెక్యూరిటీ హెడ్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసు అధికారి సచిన్ వాజేను ప్రధాన నిందితుడిగా ఎన్ఐఏ పేర్కొంది. తన ‘సూపర్ కాప్’ ఇమేజ్‌ను నిలబెట్టుకోవడం కోసమే అతను ఇలా చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది.
పేలుడు పదార్థాలున్న కారులో అంబానీలను బెదిరిస్తూ ఒక లేఖ కనిపించగానే విషయాన్ని ముఖేశ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సెక్యూరిటీ హెడ్ తెలిపారు.