Telangana: ఆరేళ్ల క్రితం మహిళా రైతు ఆత్మహత్య.. మతిస్థిమితం తప్పిన భర్త.. బడి ఈడులోనే బాధ్యతలను ఎత్తుకున్న పిల్లలు!

KTR Responds To A Journalist Tweet On Two Kids whose Mother Died 6 years Ago

  • రైతు ఆత్మహత్యగా అధికారుల నివేదిక
  • పరిహారం చెల్లించాలంటూ లెటర్
  • ఇన్నేళ్లవుతున్నా ఒక్కపైసా ఇవ్వని తెలంగాణ సర్కార్
  • ఓ జర్నలిస్ట్ ట్వీట్ తో స్పందించిన కేటీఆర్

ఆరేళ్ల నాటి మాట.. అప్పటికి వారు అందరిలాగే బడికి వెళ్లేవారు. కానీ, పంట నష్టం రూపంలో వారి అమ్మను మృత్యువు కబళించింది. తండ్రిని మానసిక రోగిగా మార్చింది. కళ్లు లేని తాత ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో అప్పటికి 12, 10 ఏళ్ల ఆ పిల్లలు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను భుజాన ఎత్తుకున్నారు. వారిద్దరు తెలంగాణలోని యాదాద్రికి చెందిన మహేశ్, మనీశ్.

వారి తల్లి సంతోష చనిపోయి ఆరేళ్లవుతోంది. వారి తండ్రి మల్లయ్య మానసిక రోగిగా మారాడు. పంట నష్టాలతో ఆమె ఆత్మహత్య చేసుకుందని అధికారులు అప్పట్లో నివేదిక తయారు చేశారు. రూ.6 లక్షల పరిహారం అందించేందుకు 2017లో నివేదికను అటాచ్ చేసి లెటర్ కూడా ప్రభుత్వానికి పంపించారు. కానీ, నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ ఒక్కపైసా పరిహారం అందలేదు.

వారి దయనీయ పరిస్థితిని ఓ జాతీయ వార్తా సంస్థకు చెందిన ఓ విలేకరి తాజాగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ సీఎంవోకు, యాదాద్రి కలెక్టర్ కు ట్వీట్ ను ట్యాగ్ చేశారు. దీంతో కేటీఆర్ స్పందించారు. వీలైనంత త్వరగా వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ శాఖ, స్థానిక అధికారులను సమన్వయం చేసుకుంటూ సమస్యను పరిష్కరించాలంటూ తన ఆఫీస్ అధికారులకు ఆదేశాలిచ్చారు.

  • Loading...

More Telugu News