Bitcoin: బిట్​ కాయిన్​ ను కరెన్సీగా ప్రకటించిన ఎల్​ సాల్వడార్​.. ప్రపంచంలోనే తొలి దేశంగా రికార్డు

El Salvador Announces Bitcoin Its Official Currency

  • 400 బిట్ కాయిన్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం
  • దేశవ్యాప్తంగా 200 బిట్ కాయిన్ ఏటీఎంల ఏర్పాటు
  • ప్రజలు, ప్రపంచ బ్యాంకు వద్దన్నా ముందుకెళ్లిన సర్కార్
  • మున్ముందు మరిన్ని కాయిన్లను కొంటామన్న దేశాధ్యక్షుడు

బిట్ కాయిన్.. ప్రస్తుతం ప్రపంచంలోని క్రిప్టో కరెన్సీల్లో మొదటి స్థానంలో ఉంటుందిది. చాలా మంది దాని మీద పెట్టుబడులు పెట్టారు. కొన్ని దేశాల్లో దాని లావాదేవీలకు సంబంధించి అనుమతులున్నా.. మరికొన్ని దేశాలు మాత్రం ఆంక్షలు విధించాయి. కానీ, ఎల్ సాల్వడార్ అనే దేశం ఆ బిట్ కాయిన్ ను ఏకంగా కరెన్సీగా ప్రకటించేసింది. తద్వారా బిట్ కాయిన్ ను కరెన్సీగా ప్రకటించిన ప్రపంచంలోనే తొలి దేశంగా నిలిచింది. అయితే, బిట్ కాయిన్ ను కరెన్సీగా ప్రకటించినప్పటికీ, జాతీయ కరెన్సీగా మాత్రం డాలర్ నే ఉంచారు.
 
ప్రపంచ బ్యాంకు వద్దన్నా.. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా.. ఇప్పటికే కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అది దోహదపడుతుందన్న ధీమాతో ధైర్యం చేసి ముందడుగేసింది. తాజా నిర్ణయంతో అన్ని షాపులు, వాణిజ్య సంస్థలు బిట్ కాయిన్ ను తీసుకోవాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుల కోసం ప్రభుత్వం కూడా వాటిని ఆమోదిస్తుంది.

ఇవాళ ఆ విషయాన్ని ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకీలి అధికారికంగా ప్రకటించారు. తాజాగా 200 బిట్ కాయిన్లను కొనుగోలు చేశామని, దీంతో ప్రభుత్వం వద్ద ఉన్న బిట్ కాయిన్ల నిల్వ 400కు చేరిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కాయిన్లను కొంటామని స్పష్టం చేశారు. మరింత మందికి ఆర్థిక స్వావలంబన ఇచ్చేందుకు ఇది దోహదం చేస్తుందని, లావాదేవీలు తక్కువ ఖర్చుతో పూర్తవుతాయని అన్నారు. ఇది ‘బిట్ కాయిన్ డే’ అంటూ ప్రకటించారు.

బిట్ కాయిన్ ఏటీఎంలు


కరెన్సీగా ప్రకటించడమే కాదు.. దేశవ్యాప్తంగా 200 బిట్ కాయిన్ ఏటీఎంలను ఆ దేశ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏటీఎంల ద్వారా బిట్ కాయిన్లను డాలర్లుగా మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. అందుకోసం ప్రభుత్వ బ్యాంకులో ఆర్థిక శాఖ 15 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,100 కోట్లు) నిధిని ఏర్పాటు చేసింది.  

వాస్తవానికి అధ్యక్షుడు బుకీలిపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. గత వారం నిర్వహించిన సర్వేలో ఆయనకు 80 శాతం మంది ప్రజామోదం లభించింది. అయితే, బిట్ కాయిన్ విషయంలో మాత్రం ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. వద్దేవద్దని తేల్చి చెప్పారు. బిట్ కాయిన్ చట్టాన్ని రద్దు చేయాలని 66 శాతం మంది చెబితే.. తాము డాలర్ నే వాడుతామని 70 శాతం మంది చెప్పుకొచ్చారు.

ఇటు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ లు బిట్ కాయిన్ పై వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఏప్రిల్, మేలో దాని ధరలు భారీగా పతనమయ్యాయని, దాని వాడకంపై మరోసారి ఆలోచన చేయాలని ఎల్ సాల్వడార్ కు ఐఎంఎఫ్ సూచించింది. బిట్ కాయిన్ ను కరెన్సీగా ఆమోదించేందుకు సాయం చేయాలన్న ఆ దేశ విజ్ఞప్తిని ప్రపంచ బ్యాంకు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. క్రిప్టోకరెన్సీలో పారదర్శకత లోపించిందని, పర్యావరణానికీ మంచిది కాదని తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News