aiims: నిఫా వైరస్ ఇలా సోకుతుంది: వివరాలు తెలిపిన ఎయిమ్స్ వైద్యుడు
- గబ్బిలాల వల్ల ఈ వైరస్ వ్యాప్తి
- గబ్బిలాలు గుంపులుగా తిరుగుతాయి
- వాటి నుంచి పందులు, గొర్రెలు వంటి జంతువులకు వైరస్
- ఆ జంతువుల నుంచి మనుషులకు..
- పండ్లను కడిగి తినాలి
కేరళలో నిఫా వైరస్ సోకి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ బాలుడిని కలిసిన 24 మంది శ్యాంపిళ్లను పూణెలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కి పంపగా వారిలో ఎనిమిది మంది శ్యాంపిళ్ల ఫలితాలు వచ్చాయి. ఆ ఎనిమిది మందికి నెగటివ్‌గా తేలినట్లు ఈ రోజు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
మిగతా శ్యాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిఫా వైరస్‌పై ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ అశుతోష్ బిశ్వాస్ స్పందిస్తూ పలు విషయాలు తెలిపారు. గబ్బిలాల వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని వివరించారు.
గబ్బిలాలు గుంపులుగా ఒకేచోట ఉంటాయని, అవన్నీ సామూహికంగా ఒక చోటు నుంచి మరో ప్రాంతానికి వెళ్తాయని చెప్పారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందుతుందన్నారు. నిఫా వైరస్‌ను కట్టడి చేసేందుకు తగిన ఔషధం లేదని వివరించారు. నిఫా సోకితే ప్రాణాపాయం ఉంటుందని హెచ్చరించారు. నిఫా వైరస్ గబ్బిలాల నుంచి పందులు, గొర్రెలు వంటి జంతువులకు సోకుతుందని, వాటి నుంచి మనుషులకు సోకుతుందని చెప్పారు. పండ్లను కొని తెచ్చుకున్నాక వాటిని శుభ్రంగా కడిగిన తరువాత తినాలని సూచించారు.