Raghu Rama Krishna Raju: వినాయకచవితిపై ఆంక్షలు వద్దని సీఎం జగన్ కు స్వరూపానందతో చెప్పించాలి: రఘురామకృష్ణరాజు
- ఏపీలో వినాయకచవితిపై ఆంక్షలు
- ఇళ్లకు పరిమితం కావాలని స్పష్టీకరణ
- స్పందించిన రఘురామకృష్ణరాజు
- హిందువుల పండుగలకే కరోనా వస్తుందా? అంటూ ఆశ్చర్యం
ఏపీ ప్రభుత్వం వినాయకచవితి పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలంటూ ఆంక్షలు విధించడం సరికాదని ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. క్రైస్తవుల పండుగలకు రాని కరోనా హిందువుల పండుగలకు వస్తుందా? అని ప్రశ్నించారు.
"ఏపీలో మద్యం దుకాణాలు, బార్ల వద్ద రద్దీగా ఉంటోంది. జయంతులు, వర్ధంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టి జరుపుతున్నారు. మరలాంటప్పుడు కరోనా రాదా? ఒక్క హిందువుల పండుగలకు మాత్రమే ఆంక్షలు విధించడం ఎందుకు? సీఎం జగన్ కు వినాయకచవితి గురించి తెలియకపోతే సీనియర్ నేతలు చెప్పొచ్చు కదా!
మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎంకు చెప్పే ధైర్యం లేకపోతే స్వరూపానంద స్వామితో అయినా చెప్పించవచ్చు కదా! ప్రతిదానికీ స్వరూపానందను సంప్రదించే దేవాదాయ మంత్రి వెల్లంపల్లి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఈ విషయంలో ఎందుకు స్పందించరు? వారిద్దరూ స్వరూపానందతో మాట్లాడి వినాయకచవితిపై జగన్ ను ఒప్పించే ప్రయత్నాలు చేయాలి" అని హితవు పలికారు.