TMC: అవినీతి ఆరోపణలు రుజువైతే నేరుగా పోడియం మీదకు వెళ్లి బహిరంగంగా ఉరేసుకుంటా: అభిషేక్ బెనర్జీ
- మనీలాండరింగ్ కేసులో నేడు ఈడీ విచారణ
- బీజేపీ ప్రతీకార చర్యలన్న అభిషేక్
- కోల్‌కతా కేసు విచారణ ఢిల్లీలోనా? అంటూ ప్రశ్న
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ కేంద్రంపై మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో బొగ్గు కుంభకోణానికి సంబంధించి నమోదైన మనీలాండరింగ్ కేసులో నేడు విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో నిన్న విచారణకు బయలుదేరిన ఆయన కోల్‌కతా విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ.. టీఎంసీని ఎదుర్కోలేక ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకోవడం తప్ప కేంద్రానికి మరో పనిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై వస్తున్న ఆరోపణలను దర్యాప్తు సంస్థలు రుజువు చేస్తే తాను నేరుగా పోడియం మీదకు వెళ్లి అందరిముందు బహిరంగంగా ఉరేసుకుంటానన్నారు. ఈమాత్రానికి సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల అవసరం లేదని కూడా అభిషేక్ పేర్కొన్నారు. రాజకీయంగా వేధించేందుకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్న ఆయన ఎలాంటి దర్యాప్తు సంస్థలనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కోల్‌కతాకు సంబంధించిన కేసులో ఈడీ తనను ఢిల్లీలో విచారణకు పిలవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.