Malladi Vishnu: ఓట్లు, సీట్లు లేని బీజేపీ నేతల మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదు: మల్లాది విష్ణు
- వినాయకచవితి వేడుకలపై రగడ
- ఇళ్లలోనే చేసుకోవాలన్న ఏపీ సర్కారు
- హిందూ పండుగలపై వివక్ష అంటూ బీజేపీ నేతల ధ్వజం
- నీతిలేని చవకబారు రాజకీయాలంటూ మల్లాది విష్ణు వ్యాఖ్యలు
వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏపీ బీజేపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో... వైద్య నిపుణుల సూచనల మేరకే వినాయక చవితి పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని సీఎం జగన్ చెప్పారని మల్లాది విష్ణు వివరించారు. ముస్లిం పండుగలైనా, క్రైస్తవుల పండుగలైనా నిబంధనలు పాటించడం తప్పనిసరి అని వెల్లడించారు. వినాయకచవితి పండుగపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ బీజేపీ నేతలు డెడ్ లైన్లు విధించడం హాస్యాస్పదమని అన్నారు.
ఓట్లు, సీట్లు లేని నేతలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ అజెండా, ఓ సిద్ధాంతం అంటూ లేని బీజేపీ నేతల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నీతిలేని చవకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మల్లాది విష్ణు బీజేపీ నేతలపై మండిపడ్డారు. బీజేపీ నేతలు ఇవాళ సమావేశం ఏర్పాటు చేసి వినాయకచవితి వేడుకలపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఏకిపారేసిన సంగతి తెలిసిందే.