Telangana: 2021-22 విద్యా సంవత్సర క్యాలెండర్ విడుదల.. మార్చి, ఏప్రిల్‌లోనే తెలంగాణలో పదో తరగతి పరీక్షలు
- టీవీ పాఠాలతో కలిపి మొత్తంగా 213 రోజుల పనిదినాలు
- జనవరి 10 లోపు ‘పది’ సిలబస్ పూర్తి చేయాలని సూచన
- ఈసారి కూడా రెండు ఎఫ్ఏ, రెండు ఎస్ఏ పరీక్షలు
- అక్టోబరు 6 నుంచి 17 వరకు దసరా సెలవులు
ఎప్పటిలానే మార్చి, ఏప్రిల్ నెలల్లోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను నిన్న విడుదల చేసింది. జులై 1 నుంచి ప్రసారం చేసిన 47 రోజుల టీవీ పాఠాలతోపాటు 166 రోజుల ప్రత్యక్ష తరగతులను కలిపి మొత్తంగా 213 రోజుల పనిదినాలు ఉంటాయని అందులో పేర్కొంది. ఏప్రిల్ 23ను చివరి పనిదినంగా పేర్కొన్న ప్రభుత్వం ఆ తర్వాతి రోజు నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులను ప్రకటించింది.
గత విద్యా సంవత్సరం లానే ఈసారి కూడా రెండు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ), రెండు సమ్మెటివ్ అసెస్‌మెంట్ (ఎస్ఏ) పరీక్షలు ఉంటాయి. జనవరి పదో తేదీ లోపు పదో తరగతి సిలబస్‌ను పూర్తి చేసి, ఆపై పునశ్చరణ ప్రారంభించాలి. మిగిలిన తరగతుల సిలబస్ మాత్రం ఫిబ్రవరి 28లోపు పూర్తి చేసి, పునశ్చరణ తరగతులు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలి.
అక్టోబరు 6వ తేదీ నుంచి 17 వరకు 12 రోజులపాటు దసరా సెలవులు, డిసెంబరు 22 నుంచి 28 వరకు ఏడు రోజులపాటు మిషనరీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు ప్రకటించగా, జనవరి 11 నుంచి 16 వరకు ఆరు రోజులపాటు సంక్రాంతి సెలువులు ప్రకటించింది.