Woman: మోసం చేశాడంటూ సీఎం కాన్వాయ్ డ్రైవర్ పై మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన యువతి
- ఒకరితో పెళ్లి.. మరొకరితో నిశ్చితార్థం
- తనకు న్యాయం చేయాలంటున్న బాధితురాలు
- పోలీసులు చర్యలు తీసుకోలేదని వెల్లడి
అతడి పేరు శశికుమార్... తెలంగాణ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ శాఖలో కానిస్టేబుల్. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో డ్రైవర్/కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే శశికుమార్ తనతో నిశ్చితార్థం చేసుకుని, మరొకరిని పెళ్లి చేసుకున్నాడంటూ ఓ యువతి జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది.
శశికుమార్ కు తనతో 2019 నవంబరులో నిశ్చితార్థం జరిగిందని, మొదట రూ.5 లక్షల కట్నానికి ఒప్పుకుని, ఆ తర్వాత రూ.10 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని అడ్డం తిరిగాడని బాధితురాలు ఆరోపించారు. దీనిపై వివాదం నడుస్తుండగానే ఈ ఏడాది ఆగస్టు 26న అతడు మరో అమ్మాయి మెళ్లో తాళికట్టాడని వెల్లడించారు. దీనిపై ఇప్పటికే రెండు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా, ఇంతవరకు చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించానని తెలిపారు.
అటు, బాధితురాలి ఫిర్యాదు మేరకు కుల్సుంపురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు షురూ చేశారు. శశికుమార్ స్వస్థలం వనపర్తి జిల్లా పెద్ద మందడి గ్రామం కాగా, బాధితురాలు హైదరాబాదులోని జియాగూడకు చెందిన యువతి. మానవ హక్కుల కమిషన్ తనకు న్యాయం చేస్తుందని భావిస్తున్నట్టు ఆమె తెలిపారు.