Maruti Suzuki: 1.81 లక్షల కార్లను వెనక్కి పిలిపిస్తున్న మారుతి సుజుకి
- మోటార్ జనరేటర్ యూనిట్ లో లోపం
- 2018-2020 మధ్య తయారైన కార్లలో లోపం
- అవసరమైతే విడిభాగాలు అమర్చుతామన్న మారుతి
- పూర్తిగా ఉచితమని వెల్లడి
వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 1,81,754 కార్లను (రీకాల్) వెనక్కి పిలిపిస్తోంది. 2018 మే 4 నుంచి 2020 అక్టోబరు 27 మధ్యకాలంలో తయారైన కార్లలోని మోటార్ జనరేటర్ యూనిట్ లో లోపం ఉన్నట్టు గుర్తించిన మారుతి రీకాల్ కు సిద్ధమైంది. భారత ఆటోమొబైల్ రంగంలో ఇదొక అతిపెద్ద రీకాల్ అని భావిస్తున్నారు.
లోపం కలిగివున్న కార్లలో సియాజ్, ఎర్టిగా, విటారా బ్రెజా, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్6 మోడళ్లు ఉన్నాయి. ఆయా కార్లను స్వచ్ఛందంగానే వెనక్కి పిలిపిస్తున్నామని మారుతి సుజుకి తెలిపింది. కార్లను తనిఖీ చేసి, అవసరమైతే కొత్త విడిభాగాలు అమర్చేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇందుకు తాము ఎలాంటి రుసుం వసూలు చేయబోమని, ఇది పూర్తిగా ఉచితమని స్పష్టం చేసింది.