Jarvo: నాలుగో టెస్టులోనూ ప్రత్యక్షమైన 'జార్వో'... ఇంగ్లండ్ స్టేడియాల్లో భద్రతపై విమర్శలు
- ఇంగ్లండ్, భారత్ మధ్య టెస్టు సిరీస్
- మైదానాల్లోకి చొరబడుతున్న యూట్యూబర్
- జార్వోపై జీవితకాల నిషేధం
- అయినా లెక్కచేయని వైనం
టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ సందర్భంగా జార్వో అనే యూట్యూబర్ తరచుగా మైదానంలోకి చొరబడుతూ హంగామా సృష్టిస్తుండడం తెలిసిందే. ఓసారి ఆటగాళ్ల మాదిరే జెర్సీ ధరించి మైదానంలోకి ఫీల్డింగ్ కు రాగా, మరోసారి రోహిత్ శర్మ అవుట్ కాగానే బ్యాటింగ్ చేయడానికి క్రీజు వద్దకు వచ్చాడు. జార్వో టీమిండియా జెర్సీ ధరించడంతో అతడిని దగ్గరికి వచ్చిన తర్వాత గానీ గుర్తించలేకపోతున్నారు. జార్వో ఆగడాలు మితిమీరడంతో క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టకుండా అతడిపై జీవితకాల నిషేధం విధించారు.
అయితే ఆ నిషేధాలను అపహాస్యం చేస్తూ జార్వో మరోసారి ప్రత్యక్షమయ్యాడు. నాలుగో టెస్టు జరుగుతున్న లండన్ కెన్నింగ్ టన్ ఓవల్లోనూ తనకు అలవాటైన రీతిలో ఆటగాళ్ల జెర్సీ ధరించి మైదానంలోకి పరుగులు తీశాడు. ఆ సమయంలో ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేయాల్సి ఉండగా, జార్వో పరుగెత్తుకుంటూ వచ్చి ఉత్తుత్తి బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్ స్టోను బలంగా ఢీకొట్టాడు. ఇంతలో స్టేడియం సిబ్బంది వచ్చి జార్వోను బయటికి తీసుకెళ్లారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో మరోసారి దుమారం రేగింది. ఇంగ్లండ్ క్రికెట్ స్టేడియాల్లో భద్రతను ఈ ఘటనలు ఎత్తిచూపుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. పైగా, కరోనా సమయంలో ఎంతో కఠినమైన బబుల్ లో ఉండే ఆటగాళ్లను ఇలా కొత్త వ్యక్తి వచ్చి తాకుతుంటే భద్రతా సిబ్బంది ఏంచేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.