Kerala: ఆ గ్రామంలో ఇక అధికారులను అన్న, అక్క అని పిలవొచ్చు.. సార్, మేడమ్ పదాలను నిషేధించిన కేరళ గ్రామం!
- కేరళలోని మథుర గ్రామం నిర్ణయం
- గౌరవ పదాల వల్ల అధికారులు, ప్రజలకు మధ్య దూరం పెరిగిపోతోందని భావన
- పనుల కోసం రిక్వెస్ట్ కాకుండా డిమాండ్ చేయాలన్న పంచాయతీ
- సార్, మేడమ్ పదాలను తొలగించిన తొలి గ్రామంగా రికార్డు
సార్, మేడమ్ వంటి గౌరవ పదాలను ఉపయోగించి పిలవడం వల్ల అధికారులకు, ప్రజలకు మధ్య దూరం పెరిగిపోతోందని భావించిన కేరళలోని ఓ గ్రామం ఆ పదాలను నిషేధించింది. ఇకపై చేటన్ (అన్న), చేచి (అక్క) అని పిలిస్తే సరిపోతుందంటూ ఉత్తర కేరళ జిల్లాలోని మథుర గ్రామ పంచాయతీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఫలితంగా ఈ పదాలను తొలగించిన దేశంలోని తొలి గ్రామంగా రికార్డులకెక్కింది.
సార్, మేడమ్ వంటి పదాల కారణంగా అధికారులతో మాట్లాడాలంటే ప్రజలు బెరుకుగా ఉంటున్నారని, వారితో తమ సమస్యలను సరిగా చెప్పుకోలేకపోతున్నారని భావించిన గ్రామ పంచాయతీ రాజకీయ పార్టీలకు అతీతంగా ఇటీవల ఓ సమావేశం నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకుంది.
అధికారులు, ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మథుర పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలకమని, ప్రజలకు వారు సేవకులని పేర్కొన్నారు. కాబట్టి వారికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వారు తమకు సేవ చేయాలని అభ్యర్థించకుండా డిమాండ్ చేయాలన్నారు.
గౌరవ పదాలను తొలగించిన అనంతరం ఆ విషయాన్ని తెలియజేస్తూ పంచాయతీ బయట నోటీసులు కూడా అంటించారు. సార్, మేడమ్ అని అధికారులను పిలవకపోయినా ప్రజల సమస్యలను వారు తీరుస్తారని అందులో పేర్కొన్నారు. వారు కనుక సమస్యలు పరిష్కరించకుంటే వారిపై ప్రెసిడెంట్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. అలాగే, ప్రతి అధికారి వద్ద వారి నేమ్ బోర్డులను ఏర్పాటు చేశారు. అపేక్ష (అప్లికేషన్) ఫామ్‌కు బదులుగా, ‘అవకాశ పత్రిక’ను తీసుకొస్తామన్నారు. అపేక్ష అంటే అభ్యర్థన అని, అందుకనే ఈ పదాన్ని కూడా మారుస్తామని పంచాయతీ పేర్కొంది.