Revanth Reddy: ప్రగతిభవన్‌లో కేసీఆర్ జీవో తయారు చేసి, ఏపీ సీఎం జగన్‌కు కానుకగా ఇచ్చారు: రేవంత్ రెడ్డి విమర్శలు

revant reddy slams  kcr

  • రోజూ 11 టీఎంసీలు ఏపీకి అదనంగా తరలించేందుకు జీవో
  • అప్పట్లో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కేసీఆర్‌కు లేఖ
  • కేసీఆర్ వినిపించుకోలేదు
  • జగన్‌తో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారా?  

నిన్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జ‌రిగిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... 2015లో కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మ‌ధ్య‌ ఒప్పందం జరిగిందని, అందులో ఆ ఒప్పందం ఏడాదికే అని స్పష్టంగా ఉంద‌ని చెప్పారు.

అయితే, ఏటా దాన్ని పొడిగించుకుంటూ వెళ్లారని, తెలంగాణ హక్కుల కోసం సీఎం కేసీఆర్‌ ప్రయత్నించడం లేదని అన్నారు. గ‌త ఏడాది మే 5న 203 జీవో ద్వారా పోతిరెడ్డిపాడు నీటి తరలింపును 4 టీఎంసీల నుంచి 8కి పెంచారని, సంగంబండ నుంచి రాయలసీమ లిఫ్ట్‌ ద్వారా 3 టీఎంసీలు తరలించేందుకు అనుమతిచ్చారని ఆయ‌న చెప్పారు.

రోజూ అదనంగా 11 టీఎంసీలు ఏపీకి అదనంగా తరలించేందుకు ప్రగతిభవన్‌లో కేసీఆర్ జీవో తయారు చేసి ఏపీ సీఎం జగన్‌కు కానుకగా ఇచ్చారని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. దీనిపై అప్పట్లో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కేసీఆర్‌కు లేఖ రాశారని గుర్తుచేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ 30 రోజుల్లో 330 టీఎంసీల నీరు తరలించుకుపోతే శ్రీశైలం ఎండిపోతుందని, నాగార్జునసాగర్ నిరుపయోగంగా మారుతుందని అప్ప‌ట్లో హెచ్చ‌రించార‌ని చెప్పారు.

అయిన‌ప్ప‌టికీ కేసీఆర్ ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న అన్నారు. గ‌తంలో కేఆర్‌ఎంబీ సమావేశాలకు ఎన్నిసార్లు ఆహ్వానించినప్ప‌టికీ రాజకీయ ప్రయోజనాల మేర‌కు కేసీఆర్ తెలంగాణ‌ సమస్యను సూటిగా లేవనెత్తలేదని ఆయ‌న ఆరోపించారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు యత్నించలేదని, ఏపీ ముఖ్య‌మంత్రి జగన్‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కుమ్మక్కయ్యారా? అని ఆయన నిల‌దీశారు.

  • Loading...

More Telugu News