Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ లో చిన్నారుల్లో వ్యాపిస్తున్న ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి!

mystery infection being reported in UP

  • చిగ్గర్స్ అనే పురుగు కాటు ద్వారా వ్యాధి
  • తీవ్రమైన జ్వరం, ముక్కు కారడం, ఒళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు
  • ప్రస్తుతానికైతే నివారణకు ఎలాంటి టీకాలు లేవు
  • మొత్తం 10 మంది మృతి.. 8 మంది చిన్నారులు 

ఉత్తరప్రదేశ్ చిన్నారులు ఓ కొత్త రకం వ్యాధి బారినపడి ప్రాణాలు విడుస్తున్నారు.‘స్క్రబ్ టైఫస్’గా పిలుస్తున్న ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే పదిమంది మరణించగా, వారిలో 8 మంది చిన్నారులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. చిగ్గర్స్ అనే పురుగు కుట్టడం వల్ల ఇది వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మధుర జిల్లాలోని కోహ్ గ్రామంలో 26 మంది, పిప్రోత్‌లో ముగ్గురు, రాల్‌లో 14 మంది, జసోడాలో 17 మంది ఈ వ్యాధి బారినపడ్డారని పేర్కొన్నారు. ఆగ్రా, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, ఎటా, కస్గంజ్ జిల్లాలలో వ్యాధి సోకి మరణాలు సంభవించినట్టు మధుర జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రచన గుప్తా తెలిపారు.

ఓరియెంటియా త్సుత్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది. చిగ్గర్స్ అనే పురుగుకాటు ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. దీనిని ‘ష్రబ్ టైఫస్’ అని కూడా పిలుస్తారని డాక్టర్ రచన గుప్తా తెలిపారు. ఈ వ్యాధి సోకినవారిలో 10 రోజుల వరకు తీవ్రమైన జ్వరం, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, ఒళ్లంతా దద్దుర్లు పుట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

దీని నివారణకు ప్రస్తుతానికి ఎలాంటి టీకాలు అందుబాటులో లేవని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది. ఈ వ్యాధికి కారణమైన చిగ్గర్స్ ఎక్కువగా చెట్ల పొదల్లో సంచరిస్తుంటాయని, ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడం, శరీరాన్ని పూర్తిగా కప్పి వుంచే దుస్తులు ధరించడం మంచిదని పేర్కొంది.

  • Loading...

More Telugu News