Nani: 'టక్ జగదీష్' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో నాని ఆసక్తికర వ్యాఖ్యలు

Nani talks in Tuck Jagadish trailer release event

  • నాని, రీతూవర్మ జంటగా టక్ జగదీష్
  • శివ నిర్వాణ దర్శకత్వంలో చిత్రం
  • ఈ నెల 10న ఓటీటీలో రిలీజ్
  • తనపై వస్తున్న విమర్శలకు బదులిచ్చిన నాని

నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం టక్ జగదీష్. ఇందులో నాని సరసన రీతూవర్మ కథానాయికగా నటించింది. ఈ సినిమాను ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాని కూడా పాల్గొన్నారు. టక్ జగదీష్ ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయకుండా ఓటీటీకి ఇవ్వడంపై విమర్శలు వస్తుండడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనపై కొందరు విమర్శలు చేస్తున్నారని, తాను కూడా వారి కుటుంబసభ్యుడి లాంటివాడ్నే అని, కానీ ఇవాళ తనను పరాయివాడిగా భావించి విమర్శలు చేయడం బాధ కలిగించిందని అన్నారు. పరిస్థితులు సరిగా లేవు కాబట్టే ఓటీటీలో విడుదల చేస్తున్నామని నాని వివరణ ఇచ్చారు. అలా కాకుండా థియేటర్లలో విడుదలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, తాము ఓటీటీలో విడుదల చేస్తే అప్పుడు తనపై తానే నిషేధం విధించుకుంటానని నాని స్పష్టం చేశారు.

ఇక టక్ జగదీష్ సినిమా గురించి చెబుతూ, తన చిత్రం వినాయకచవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుండడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమా చూసిన వారు పండుగ రోజు పరిపూర్ణం అయిందని సంతోషిస్తారని నాని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు శివ నిర్వాణతో ఇంతకుముందు 'నిన్ను కోరి' చిత్రంలో నటించానని, ఆ తర్వాత ఆయన మజిలీ చిత్రం తీశారని, వాటిని మించిన భావోద్వేగాలు టక్ జగదీష్ లో ఉంటాయని అన్నారు.

Nani
Tuck Jagadish
Trailer
OTT
Tollywood
  • Loading...

More Telugu News