GST: ఈ నెల కూడా లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు!
- వరుసగా రెండో సారి ఈ ఫీట్
- జులైలో ఏకంగా 1.16 లక్షల కోట్లు
- కరోనా సెకండ్ వేవ్ కారణంగా జూన్ నెలలో తగ్గిన ఆదాయం
- వివరాలు వెల్లడించిన ఆర్థిక శాఖ
భారతదేశంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా రెండో నెలలో కూడా లక్షకోట్లు దాటినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆగస్టు నెలలో మొత్తం 1.12 లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్లు తెలిపింది. జులై నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకుపైగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో ఈ మొత్తం 86,449 కోట్ల రూపాయలుగా ఉంది. అప్పటితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 30 శాతం పెరిగాయన్నమాట.
ఇక ఈ ఏడాది వసూలైన రూ.1,12,020 కోట్లలో కేంద్ర జీఎస్టీ రూ.20,522 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.26,605 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇవిగాక ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.56,247 కోట్లు కాగా, దీనిలో రూ.26,884 కోట్లు దిగుమతులపై వేసిన పన్నే కావడం విశేషం. అదే విధంగా సెస్ రూ.8,646 కోట్లు వసూలవగా, దీనిలో రూ.646 కోట్లు దిగుమతులపై విధించారట.
ఈ వివరాలను వెల్లడించిన ఆర్థిక శాఖ.. జులైతో పోలిస్తే ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు కొద్దిగా తగ్గాయని పేర్కొంది. జులై నెలలో రూ.1.16 లక్షల కోట్లు జీఎస్టీ వసూలైన సంగతి తెలిసిందే. ఆగస్టులో ఇది రూ.1.12 లక్షల కోట్లు మాత్రమే. గత అక్టోబరు నుంచి జీఎస్టీ వసూళ్లు లక్షకోట్ల పైగానే ఉంటూ వచ్చాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా జూన్ నెలలో ఈ వసూళ్లు రూ. 92,849 కోట్లకు పడిపోయాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది.