CPI Ramakrishna: మంత్రి పదవుల కోసం ఇంత దిగజారి మాట్లాడాలా?: ఏపీ మంత్రులపై సీపీఐ రామకృష్ణ ఫైర్
- పిచ్చిపట్టినట్టు మంత్రులు మాట్లాడుతున్నారు
- రాజధాని రైతులతో మాట్లాడటం అనవసరమని ఒక మంత్రి అంటారు
- సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని మరో మంత్రి అంటారు
వైసీపీ మంత్రులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. పిచ్చిపట్టినట్టు మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజధాని రైతులతో మాట్లాడటం అనవసరమని ఓ మంత్రి అంటారని... సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని మరో మంత్రి అంటాడని... మంత్రి పదవుల కోసం ఇంతగా దిగజారిపోయి మాట్లాడాలా? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సిమ్లాకు పోతే... ఏపీ రాజధాని సిమ్లా అయిపోతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థికమంత్రా? లేక అప్పుల మంత్రా? అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
జిల్లాలోని ఎమ్మెల్యేల ఆదాయానికి సహకరించకపోవడం వల్లే అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడుని బదిలీ చేశారని రామకృష్ణ ఆరోపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చూసి జగన్ నేర్చుకోవాలని హితవు పలికారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిస్సిగ్గుగా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని దుయ్యబట్టారు. రైల్వేలు, రోడ్లు, పోర్టులు, పరిశ్రమలు ఇలా అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీకి వ్యతిరేకంగా ఈ నెల 20న అన్ని పార్టీలతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ఈ నెల 25న భారత్ బంద్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.