Afghanistan: కొరకరాని కొయ్యగా పంజ్ షీర్.. నిన్న ఒక్కరాత్రే 350 మంది తాలిబన్ల హతం!
- వెల్లడించిన పంజ్ షీర్ పోరాట దళం
- బందీలుగా మరో 40 మంది
- అమెరికా ఆయుధాలు, వాహనాలు స్వాధీనం
- శరణార్థుల కోసం బ్రిటన్ ‘ఆపరేషన్ వార్మ్ వెల్ కం’
- కశ్మీర్ కు స్వేచ్ఛ ప్రసాదించాలన్న అల్ ఖైదా
ఆఫ్ఘనిస్థాన్ లో అన్నింటినీ స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు పంజ్ షీర్ మాత్రం కొరకరాని కొయ్యగా తయారైంది. ఆక్రమించేందుకు తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలను పంజ్ షీర్ యోధులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నిన్న రాత్రి పంజ్ షీర్ ప్రావిన్స్ లోని ఖవక్ లో జరిగిన హోరాహోరీలో 350 మంది తాలిబన్లు హతమైనట్టు పంజ్ షీర్ పోరాట దళంలోని నార్తర్న్ అలయన్స్ ప్రకటించింది.
మరో 40 మందిని బందీలుగా పట్టుకున్నామని వెల్లడించింది. వారి నుంచి అనేక అత్యాధునికమైన అమెరికా ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. కమాండర్ మునీబ్ అమీరి ఆధ్వర్యంలో తిరుగుబాటు చేశామని తెలిపింది. అయితే, పంజ్ షీర్ ను ఆక్రమించేందుకు తాలిబన్లు అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నారు. గుల్బహర్ నుంచి ఇవాళ దాడులు చేశారు. అయితే, పంజ్ షీర్ పోరాట దళాలు వాటిని తిప్పికొడుతున్నాయి. గుల్బహర్ లోకి ఎవరూ రాకుండా తాలిబన్లు కంటెయినర్ తో రోడ్డును బ్లాక్ చేశారు. ఇప్పుడు అక్కడ రెండు వర్గాల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.
కాగా, ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్న బ్రిటన్ వాసులను తీసుకొచ్చేందుకు తాలిబన్లతో ఆ దేశం చర్చలను మొదలుపెట్టింది. అంతేగాకుండా ఆఫ్ఘన్ శరణార్థులకు చోటు కల్పించేందుకు ‘ఆపరేషన్ వార్మ్ వెల్ కమ్’ను ప్రారంభించింది. ఖతార్ లోని దోహాలో చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇటు పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్ కు 15 సంక్షోభ స్పందన దళాలను బ్రిటన్ పంపిస్తోంది.
ఇటు ఇవాళ విదేశీ దళాలు లేకుండా తొలిసారి ఆఫ్ఘన్లు తమ జీవితాన్ని ప్రారంభించారు. డబ్బులకు జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఏటీఎంల ముందు క్యూ కట్టిన వారికి తక్కువ మొత్తంలోనే ఇస్తున్నారు. మరోపక్క, ఇటు కశ్మీర్ పైనా తాలిబన్లను అల్ ఖైదా ఉసిగొల్పుతోంది. ప్రపంచంలోని ముస్లింలు ఉన్న ప్రాంతాలన్నింటికీ ఆయా దేశాల నుంచి స్వేచ్ఛ కల్పించాలంటూ రెచ్చగొడుతోంది. ‘‘ఓ అల్లా.. సోమాలియా, యెమన్, కశ్మీర్ .. ఇతర ముస్లిం ప్రాంతాలకు స్వేచ్ఛను ప్రసాదించు’’ అనే సందేశాన్ని తాలిబన్లకు అల్ ఖైదా పంపించింది.