Pawan Kalyan: ఏపీలో రోడ్ల దుస్థితిపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు!

All roads in AP are in worst condition says Pawan Kalyan

  • ఏపీలో రోడ్ల వ్యవస్థ దారుణంగా ఉంది
  • అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా పరిస్థితి ఉంది
  • రోడ్ల దుస్థితిపై అడిగిన వారిపై కేసులు పెడుతున్నారు

ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిపై జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఒక దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రాంతం కానీ అభివృద్ది చెందాలంటే రహదారుల వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలని ఆయన అన్నారు. అందుకే ప్రధాని మోదీగారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వేలాది కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు. ఏపీలో మాత్రం వైసీపీ పాలనలో రోడ్ల వ్యవస్థ దారుణంగా తయారయిందని.. అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా పరిస్థితి ఉందని విమర్శించారు.

నివర్ తుపాను సమయంలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు దెబ్బతిన్న రోడ్లను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఆ పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం తిప్పవరపుపాడు గ్రామానికి వెళ్లే దారిలో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు ఛిద్రమైందని అన్నారు. నిలువెత్తు గోతులతో ఉన్న ఆ దారిలో ఒక ట్రాక్టర్ తిరగబడిపోయిందని చెప్పారు. గర్భిణి స్త్రీతో వెళ్తున్న ఆటో కూడా తిరగబడిపోయిందని తెలిపారు. రోడ్ల దుస్థితిపై ప్రజాప్రతినిధికి చెప్పినా మార్పు రాలేదని చెప్పారు.

రోడ్ల గురించి అడిగితే పోలీసులతో లాఠీఛార్జీలు చేయించే పరిస్థితులు ఉన్నాయని పవన్ మండిపడ్డారు. ఒక నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లక్షా 20 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు ఉన్నాయని... ఈ రోడ్లు దెబ్బతిన్నా బాగు చేయడం లేదని దుయ్యబట్టారు. కరోనా పరిస్థితులు ఉన్నాయనో, ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామనో ఇంత కాలం ఆగామని... కానీ, పరిస్థితి నానాటికీ దిగజారుతోందని... నోరు తెరిచి అడిగిన వారిపై పోలీసుల సాయంతో కేసులు పెట్టించే పరిస్థితి వచ్చిందని పవన్ మండిపడ్డారు.

రోడ్డు బాగోలేదు, ఏదైనా చేయండి అని స్థానిక ప్రజాప్రతినిధిని అడిగినందుకు గిద్దలూరు నియోజకవర్గంలో వెంగయ్యనాయుడు అనే జనసైనికుడు ఆత్మహత్యకు పాల్పడేలా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల అధ్వాన పరిస్థితిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పవన్ చెప్పారు. సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే... అక్టోబర్ 2న రోడ్లను శ్రమదానం చేసి మనమే బాగు చేసుకుందామని చెప్పారు.

  • Loading...

More Telugu News