KTR: ఎల్లుండి టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ.. భారీగా ఏర్పాట్లు.. ముఖ్య‌నేత‌ల‌తో కేటీఆర్ భేటీ

ktr on trs flag festival

  • పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచ‌న‌లు
  • అన్ని గ్రామాలు, పట్టణాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలి
  • పార్టీ సంస్థాగత నిర్మాణంపైన దృష్టిపెట్టాలి
  • ఎల్లుండే ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసుకి శంకుస్థాప‌న‌

టీఆర్ఎస్ పార్టీ ఎల్లుండి పార్టీ జెండా పండగను పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌నుంది. ఈ మేర‌కు తెలంగాణ మంత్రి, ఆ పార్టీ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ త‌మ‌ పార్టీ శ్రేణులకు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ రోజు త‌మ పార్టీ ముఖ్య‌ నేత‌లంద‌రితో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఆయ‌న మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో పార్టీ జెండాను ఎగురవేయాల‌ని చెప్పారు.

పార్టీ సంస్థాగత నిర్మాణంపైన దృష్టిపెట్టాల‌న్నారు. పార్టీ జెండా పండగ కార్యక్రమానికి పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. మ‌రోవైపు అదే రోజున‌ డీల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న చేయ‌నున్నారని తెలిపారు.

ఆ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యేలు, ఇత‌ర నాయ‌కులు హాజ‌రు కానున్నారు. ఈ జెండా పండగ త‌ర్వాత క‌మిటీల ఏర్పాటుపై దృష్టిపెట్టాల‌ని సూచించారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ పంచాయతీలు, వార్డు కమిటీల ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంత‌రం సెప్టెంబ‌రు 20 వరకు మండల, పట్టణ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

జిల్లా కార్యవర్గాల ఎంపిక అనంత‌రం రాష్ట్ర కార్యవర్గాన్ని కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికే పార్టీ కమిటీలలో చోటు ఉంటుందని ఆయ‌న తెలిపారు. ఆయా కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కచ్చితంగా 50 శాతం ఉండాలని చెప్పారు. తొలుత‌ మండల కమిటీలు ఏర్పాటు పూర్తి చేసి, అనంత‌రం గ్రామస్థాయి సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు.

 హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం ఉంటుందని, ఇక్క‌డ‌ బస్తీ కమిటీ, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ తొలి వారంలోనే ఈ సమావేశం ఉంటుంద‌ని కేటీఆర్ వెల్ల‌డించారు.

  • Loading...

More Telugu News