Kurnool District: డోన్‌లో దొంగల బీభత్సం.. ఏటీఎం నుంచి రూ. 65 లక్షలకు పైగా దోపిడీ

Rs 65 lakhs stolen from kurnoll dist Dhone ATM

  • శని, ఆదివారాల్లో సెలవు కావడంతో రూ. 85 లక్షల నగదు నింపిన అధికారులు
  • గ్యాస్ కట్టర్‌, గడ్డపారతో ఏటీఎంను పెకలించిన వైనం
  • అనుభవం ఉన్న దొంగల పనేనని పోలీసుల అనుమానం

కర్నూలు జిల్లా డోన్‌లో దొంగలు చెలరేగిపోయారు. ఓ ఏటీఎంలోకి చొరబడి రూ. 65 లక్షలకు పైగా దోచుకెళ్లారు. డోన్ పోలీస్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం. నెహ్రూనగర్ ప్రధాన రహదారిపై ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎం సెంటర్‌లోకి ఆదివారం రాత్రి చొరబడిన దొంగలు గ్యాస్ కట్టర్, గడ్డపారతో రెండు ఏటీఎంలను పెకలించారు.

 అనంతరం వాటిలోని డబ్బును దోచుకున్నారు. ఏటీఎంలు ధ్వంసమై ఉండడాన్ని నిన్న గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బ్యాంకు అధికారులు తెల్లవారుజామున 2.56 గంటల సమయంలో దోపిడీ జరిగినట్టు గుర్తించారు. శని, ఆదివారాలు సెలవు దినాలు. దీంతో వినియోగదారులకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో బ్యాంకు అధికారులు రూ. 85 లక్షలు నింపి పెట్టారు. ఈ సొమ్ములో రూ. 65,61,900 చోరీకి గురైనట్టు గుర్తించారు.

ఇక చోరీ జరిగిన తీరును బట్టి అనుభవం ఉన్న దొంగలే ఈ దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏటీఎం బయట ఉన్న సీసీటీవీని పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. లోపలున్న కెమెరాను పక్కకు తిప్పేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News