UAE: కరోనా వ్యాక్సిన్ పొందిన భారతీయులు యూఏఈలో ప్రవేశించేందుకు అనుమతి
- సెకండ్ వేవ్ సమయంలో ఆంక్షలు
- నేటి నుంచి వీసాలు జారీ చేస్తున్న యూఏఈ
- అన్ని దేశాల పౌరులకు ద్వారాలు తెరిచిన అరబ్ ఎమిరేట్స్
- వ్యాక్సిన్ రెండు డోసులు పొంది ఉండాలని వెల్లడి
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వివిధ దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించడం తెలిసిందే. యూఏఈ ఆంక్షలు విధించినవారిలో భారతీయులు కూడా ఉన్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం విదేశీయులను అనుమతించాలని నిర్ణయించింది.
భారత్ సహా అన్ని దేశాల పౌరులు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టయితే తమ దేశంలో అడుగుపెట్టవచ్చని పేర్కొంది. ఈ క్రమంలో నేటి నుంచి యూఏఈ ప్రభుత్వం వీసాలు మంజూరు చేస్తోంది. ఆగస్టు 30 నుంచి టూరిస్టు వీసా దరఖాస్తులు అన్ని దేశాల పౌరులకు అందుబాటులో ఉంటాయని యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్ షిప్ (ఐసీఏ), నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్, అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఎన్సీఈఎంఏ) సంయుక్తంగా ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.
అయితే, యూఏఈకి వచ్చేవారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం పొందిన వ్యాక్సిన్ ను తీసుకుని ఉండాలని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.