Corona Virus: కరోనా నిబంధనలను పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
- జనం భారీగా గుమికూడకుండా చూడాలి
- రద్దీ ప్రాంతాల్లో నిబంధనలు కఠినంగా అమలు చేయాలి
- ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలి
గత కొన్ని రోజులుగా మన దేశంలో కరోనా మహమ్మారి కొంత మేర తగ్గుముఖం పట్టింది. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేసులు ఆందోళనకర స్థాయిలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అమలవుతున్న కరోనా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. సెప్టెంబర్ 30 వరకు కరోనా నిబంధనలను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్ లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖలు రాశారు.
కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని లేఖలో కేంద్రం తెలిపింది. జనం భారీగా గుమికూడకుండా చూడాలని సూచించింది. రద్దీ ప్రాంతాల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. కరోనాను కట్టడి చేసేలా తగిన కార్యాచరణ రూపొందించాలని సూచించింది. పండుగల నేపథ్యంలో ఐదంచెల వ్యూహమైన టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ నిబంధనలను పాటించడాన్ని కఠినంగా అమలు చేయాలని తెలిపింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. అవసరాలను బట్టి స్థానికంగా ఆంక్షలను అమలు చేయాలని తెలిపింది.