Malla Reddy: రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు: మంత్రి మల్లారెడ్డి
- మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ రాలేదని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
- అప్పట్లో ఈ విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పాను
- దొంగ పత్రాలు తీసుకొచ్చి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
తాను టీడీపీ తరపున ఎంపీ అయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని టీఆర్ఎస్ నేత, మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు మల్కాజ్ గిరి ఎంపీ సీటును ఆయనకు కాకుండా తనకు ఇచ్చినందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని అప్పట్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి తనను ఇబ్బంది పెడుతూనే ఉన్నారని మండిపడ్డారు. రేవంత్ ఎంపీ అయిన తర్వాత అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
ఇటీవల రేవంత్, మల్లారెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి మరోసారి రేవంత్ ను టార్గెట్ చేశారు. 2012లో తాను మెడికల్ కాలేజీని స్థాపించానని మల్లారెడ్డి చెప్పారు. అమ్మాయిల కోసం మహిళా కాలేజీలను ప్రారంభించానని తెలిపారు. తమ హాస్టళ్లలో 7 వేల మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఏవో దొంగ పత్రాలు తీసుకొచ్చి తప్పుడు ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. అన్ని అనుమతులతోనే ఆసుపత్రిని నిర్మించానని చెప్పారు. తన కాలేజేలు, ఆసుపత్రులకు అన్ని పత్రాలు కరెక్ట్ గా ఉన్నాయని తెలిపారు.
ఎంపీగా తాను రూ. 200 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్టు మల్లారెడ్డి చెప్పారు. రేవంత్ ఎంపీ అయిన తర్వాత కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని... పార్లమెంటులో కూడా మల్లారెడ్డి విద్యా సంస్థల గురించి ప్రశ్నలు వేశారని మండిపడ్డారు. తన విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదనే విషయన్ని కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా తెలిపిందని చెప్పారు.