vaccine: భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ.. బిల్‌గేట్స్, సౌమ్య స్వామి నాథన్ ప్రశంసలు
- దేశంలో నిన్న 1,03,35,290 డోసుల వినియోగం
- జనాభాలో 50 శాతం మందికి కనీసం ఒక్కడోసు వేశారన్న సౌమ్య
- కీలక మైలురాయి దాటిన భారత్‌కు అభినందనలు తెలిపిన బిల్‌గేట్స్
దేశంలో నిన్న 1,03,35,290 డోసుల వ్యాక్సిన్లను వినియోగించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం వినియోగించిన డోసుల సంఖ్య 62,29,89,134కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. భారీ జనాభా ఉన్న భారత్‌లో ప్రజలకు రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు వేయడం పట్ల పలువురు అంతర్జాతీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఈ విషయంపై స్పందిస్తూ... భారత్ వయోజన జనాభాలో 50 శాతం మందికి కనీసం ఒక్కడోసు వేశారని గుర్తు చేశారు. 62 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయని, నిన్న ఒక్కరోజే కోటిమంది వ్యాక్సిన్ వేయించుకున్నారని అన్నారు. ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
భారత్ లో వ్యాక్సినేషన్ పై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ స్పందిస్తూ.. వ్యాక్సిన్ ప్రోగ్రాంలో కీలక మైలురాయి దాటిన భారత్‌కు అభినందనలు చెబుతున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ సంస్థలు, వైద్య సిబ్బంది కలిసి చేసిన కృషి వల్ల ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు. మరోవైపు, ఒక్కరోజులో కోటి మందికి వ్యాక్సిన్ వేయడం గొప్ప విషయమని ప్రధాని మోదీ కూడా ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు. వ్యాక్సినేషన్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు చెప్పారు.